
ఎన్టీఆర్ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల చెయ్యకపోవచ్చు అని మొన్నటి వరకు అతని అభిమానులు కంగారు పడ్డారు. ఎందుకంటే, గతేడాది “దేవర” విడుదల చేసిన తర్వాత “దేవర 2″ని పక్కన పెట్టారు. దానికన్నా ముందు మిగతా సినిమాలు చెయ్యాలని “వార్ 2″కి డేట్స్ ఇచ్చాడు ఎన్టీఆర్. అలాగే, దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాకి జెండా ఊపాడు.
ఐతే, “వార్ 2” ఈ ఏడాది విడుదల కావడం కష్టం అని, వచ్చే ఈఏడాది రిపబ్లిక్ డేకి వస్తుంది అని పుకార్లు వినిపించాయి. ఆ ప్రచారంలో నిజం లేదని తేలింది. ఈ ఏడాది పంద్రాగస్టుకే “వార్ 2” విడుదల కానుంది. ఆగస్టు 14, 2025న “వార్ 2” విడుదల అని బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ ఈ రోజు ప్రకటించింది. ఆ విధంగా క్లారిటీ వచ్చింది.
2025లో ఎన్టీఆర్ నుంచి వచ్చే మూవీ ఇదే. వచ్చే ఏడాది సంక్రాంతికి “డ్రాగన్”ని విడుదల చెయ్యాలనేది ప్లాన్. ప్రశాంత్ నీల్ ఇప్పటికే “డ్రాగన్” షూటింగ్ ప్రారంభించాడు. ఎన్టీఆర్ త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటాడు. “వార్ 2”, “డ్రాగన్ 2” విడుదల తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఏంటి అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.
“దేవర 2” మొదలు పెడతాడని అంటున్నారు కానీ ఎన్టీఆర్ ఇతర దర్శకులతో కూడా చర్చలు జరుపుతున్నాడు మరి. తమిళ దర్శకుడు నెల్సన్ ఇప్పటికే కథ చెప్పి వెళ్ళాడు. అందుకే, “దేవర 2” స్టార్ట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఐతే, ప్రతి ఏడాది కనీసం ఒక సినిమా విడుదల చెయ్యాలి అనేది ఎన్టీఆర్ తాజా పాలసీ. దానికి తగ్గట్లు తన సినిమాల ప్లానింగ్ చేసుకుంటున్నాడు.
“ఆర్ ఆర్ ఆర్” కోసం ఏకంగా నాలుగేళ్ల కాలం వెళ్ళిపోయింది. ఆ భర్తీ చేసేందుకు ఇప్పుడు ఏడాదికి ఒక సినిమా విడుదల అయ్యేలా చూసుకుంటున్నాడు.