కాస్త వయసుమళ్లిన హీరోలను తెరపై చూపించాలంటే అదనపు హంగులు జోడించాల్సిందే. గ్రాఫిక్స్, కెమెరా యాంగిల్స్, లైటింగ్ లో చాలా మార్పులు చేస్తుంటారు. చిరంజీవి, బాలకృష్ణ లాంటి హీరోల సినిమాల్లో ఈ విషయాన్ని ఎక్కువగా గమనించొచ్చు.
అయితే ‘విశ్వంభర’లో మాత్రం అలాంటి జిమ్మిక్కులు ఉండవంటున్నాడు కెమెరామెన్ ఛోటా.
చిరంజీవి సినిమాకు మరోసారి వర్క్ చేసిన ఈ సినిమాటోగ్రాఫర్.. చిరంజీవిని అందంగా చూపించడం కోసం, ఆయన వయసును తగ్గించడం కోసం, ఎలాంటి కెమెరా జిమ్మిక్కులు చేయలేదని స్పష్టం చేశాడు.
చిరంజీవి ప్రస్తుతం రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారో, అంతే అందంగా, ఆరోగ్యంగా ‘విశ్వంభర’లో కూడా కనిపిస్తారని చెబుతున్నాడు. ఆయన క్రమశిక్షణలో కూడిన జీవితాన్ని పాటిస్తారని, మంచి ఫుడ్ తీసుకుంటారని, కాబట్టి ఆయనకు కెమెరా జిమ్మిక్కులు అవసరం లేదని అంటున్నాడు.
‘విశ్వంభర’ టీజర్ రిలీజ్ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశాడు ఛోటా. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కూడా చాన్నాళ్లుగా సినిమాల్లో నటిస్తున్నప్పటికీ.. ఈమధ్య చూసేకొద్దీ చూడాలనిపిస్తోంది, అంత అందంగా తయారవుతోందని ఛోటా అన్నాడు.