
కొత్త ఏడాది సౌత్ పై నెట్ ఫ్లిక్స్ గట్టిగా ఫోకస్ పెట్టినట్టుంది. అమెజాన్ ప్రైమ్ ఆధిపత్యానికి గండి కొట్టే దిశగా వరుసగా సినిమాలు దక్కించుకుంటోంది. ఈ క్రమంలో ఈ ఏడాది తాము దక్కించుకున్న కొన్ని తెలుగు సినిమాల జాబితాను విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్.
ఇందులో పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాతో పాటు మరెన్నో సినిమాలున్నాయి. నాని ‘హిట్-3’, విజయ్ దేవరకొండ కొత్త సినిమా, నాగచైతన్య ‘తండేల్’, రవితేజ ‘మాస్ జాతర’, ‘మ్యాడ్ స్క్వేర్’, సిద్ధు జొన్నలగడ్డ ‘జాక్’, ప్రియదర్శి ‘కోర్ట్’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’.. ఇలా చాలా సినిమాలు నెట్ ఫ్లిక్స్ ఖాతాలో చేరాయి.
ఇవి కొన్ని మాత్రమే. త్వరలోనే మరిన్ని సినిమాల్ని ఈ కంపెనీ ప్రకటించబోతోంది. అటు తమిళనాట కూడా అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, సూర్య ‘రెట్రో’ సినిమాల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. చూస్తుంటే.. ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ వెర్సెస్ నెట్ ఫ్లిక్స్ గట్టిపోటీ నడిచేలా ఉంది.
ఈ రేసులో జియో హాట్ స్టార్, సోనీ లివ్, జీ5 బాగా వెనకబడ్డాయనే చెప్పాలి. ఉన్నంతలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాంటి సినిమాలతో జీ5 కాస్త ముందంజలో ఉంది. ఇక స్టార్ ఎట్రాక్షన్ లేని చిన్నాచితకా సినిమాలు, ఫ్లాప్ మూవీస్, డబ్బింగ్ మూవీస్ లాంటివి ‘ఆహా’లో కనిపించబోతున్నాయి.