“సరిపోదా శనివారం” మొదటి వీకెండ్ కలెక్షన్లు సంతృప్తికరంగా ఆడడంతో నాని ఆనందంగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ సినిమా అమెరికాలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అక్కడ ఆ సినిమా తన కెరీర్లోనే అతిపెద్ద హిట్ గా అవతరించనుంది. ఇక తదుపరి చిత్రంపై ఫోకస్ పెట్టాడు.
నాని ఆ మధ్య ‘దసరా’ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఒక సినిమా ప్రకటించాడు. కానీ ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులకు చాలా టైం పట్టనుంది. దాంతో, ఆ సినిమా షూటింగ్ ని వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ‘హిట్ 3’ సినిమాలో నటించనున్నాడు నాని.
నాని సమర్పణలో ప్రశాంతి తిపిరనేని నిర్మాణంలో ఇప్పటివరకు రెండు ‘హిట్’ చిత్రాలు వచ్చాయి. శైలేష్ కొలన్ డైరెక్ట్ చేసిన ‘హిట్’ మొదటి భాగంలో విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. రెండో భాగం ‘హిట్ 2’లో అడవి శేష్ హీరో. ఆ సినిమాలోనే చివర్లో నాని కనిపించాడు. ఇప్పుడు హిట్ ‘3’లో నాని పోలీస్ అధికారిగా, నేరాలను ఛేదించే హీరోగా నటిస్తాడు.
‘హిట్ 3’ సినిమా షూటింగ్ ఈ నెలలోనే మొదలవుతుంది. వచ్చే ఏడాది మార్చిలో సినిమా రిలీజ్ కానుంది.