
సీనియర్ హీరో అక్కినేని నాగార్జున హీరోగా సినిమాలు చెయ్యడం తగ్గించారు. ప్రతి ఏడాది బిగ్ బాస్ షోని నిర్వహించడం లేదా అడపాదడపా హీరోగా నటించడమో చేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే వేరే హీరోల చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషించేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఆ మధ్య బాలీవుడ్ మూవీ ‘బ్రహస్త్ర’లో అలాగే చేశారు.
ఇక ఇప్పుడు మాజీ మామా అల్లుడితో సినిమాలు చేస్తున్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల తీస్తున్న “కుబేర” చిత్రంలో నాగార్జున ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం మనకు తెలుసు. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తున్నారు. ధనుష్ తో ఇలా సినిమాలో నటిస్తున్న టైంలోనే నాగార్జునకి రజినీకాంత్ కొత్త సినిమాలో నటించే ఆఫర్ వచ్చింది.
రజినీకాంత్ తో తాను తీస్తున్న “కూలీ” చిత్రంలో నటించాల్సిందిగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ అడగ్గానే నాగార్జున ఓకె చెప్పేశారు. ఈ రోజు నాగార్జున పుట్టిన రోజు సంధర్భంగా ఆయన పేరుని ప్రకటించారు. “కూలీ” సినిమాలో నాగార్జున సైమన్ అనే పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా వైజాగ్ లో జరుగుతోంది. త్వరలోనే నాగార్జున షూటింగ్ లో పాల్గొంటారు.
ఇలా ఒకేసారి ధనుష్, రజినీకాంత్ సినిమాల్లో నాగార్జున కీలక పాత్రలు చేస్తున్నారు. ధనుష్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యని పెళ్లాడారు. ఇటీవలే వారు విడాకులు తీసుకున్నారు.