మీడియా ప్రతినిధిని కొట్టిన విషయాన్ని మోహన్ బాబు అంగీకరించారు. ఆ చీకట్లో అలా జరిగిపోయిందన్నారు. తను చాలా బాధపడుతున్నానని అన్నారు.
“ఆ చీకట్లో అలా జరిగింది వాస్తవమే. మైక్ లాక్కోవడం, వాడు నాపై కేకలు వేశాడు. ఆ వేడిలో ఘర్షణ జరిగింది. నేను కొట్టిన దెబ్బ అతడికి తగిలి ఉండొచ్చు. నేను హృదయపూర్వకంగా బాధపడుతున్నాను. ఈరోజుకీ నేను బాధపడుతున్నాను. అలా ఆవేదనకు గురై నేను కూడా హాస్పిటల్ లో చేరాను. సినిమాల్లో నటిస్తాను తప్ప, నిజజీవితంలో నేను నటించాల్సిన అవసరం లేదు.”
తన ఇంటి గేటు బయట ఎవర్నయినా కొట్టనట్టయితే అది తప్పు అవుతుందని, అప్పుడు తనపై వంద కేసులు పెట్టినా ఒప్పుకుంటానని తెలిపిన మోహన్ బాబు.. ఇంటి గేటు తోసుకొని లోపలకొచ్చి, తన మనశ్శాంతిని భంగం చేశారని ఆరోపించారు.
“నేను కొట్టడం తప్పు, కానీ ఏ సందర్భంలో కొట్టాల్సి వచ్చిందో మీరే ఆలోచించాలి. నేను కొట్టానని చెబుతున్నారు కానీ, అంతకంటే ముందు మైక్ తీసి నా నోట్లో పెట్టిన విషయం చెప్పడం లేదు. నా కన్ను పోవాల్సింది. నిజంగా నా కన్నుపోతే నేను కేసులు పట్టే పరిస్థితి వచ్చేది. కంటి కింద చిన్న దెబ్బతో నేను ఎస్కేప్ అయ్యాను. లేదంటే నా జీవితం గుడ్డిదయ్యేది.”
లోపలకు దూసుకొచ్చిన వాళ్లంతా మీడియా ప్రతినిధులేనా కాదా అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు మోహన్ బాబు. ఏదేమైనప్పటికీ అలా చేయిచేసుకోవడం తప్పేనంటూ బాధపడ్డారు.