దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి ఇప్పుడు తమిళనాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. శంకర్, మణిరత్నంలాంటి లెజెండ్స్ పక్కన పెడితే ప్రస్తుతం తమిళనాడులో టాప్ డైరెక్టర్ ఎవరంటే లోకేష్ పేరే చెప్తారు. అతను తీసిన సినిమాలు, ఇచ్చిన హిట్లు అలాంటివి.
ఈ కుర్ర దర్శకుడు ఇప్పుడు కేవలం దర్శకత్వంతోనే సరిపెట్టుకోదల్చుకోలేదు. నటుడిగా, నిర్మాతగా కూడా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. జనంలో ఉన్న క్రేజుని యూజ్ చేసుకుంటున్నాడు.
లోకేష్ తాజాగా నిర్మాత అవతారం ఎత్తి రాఘవ లారెన్స్ హీరోగా ఒక సినిమా తీస్తున్నాడు. అతను డైరెక్షన్ చెయ్యడం లేదు. కేవలం నిర్మాతగా, ప్రెజెంటర్ గా మాత్రమే వ్యవహరిస్తున్నాడు. ఇకపైనా చాలా సినిమాలు నిర్మిస్తాను అంటున్నాడు.
ఇక అతను నటుడిగా మారి ఈ మధ్య శృతి హాసన్ కి ప్రియుడిగా నటించాడు. శృతి హాసన్ కి పాటల పిచ్చి. ఆమె ఆల్బమ్స్ చేస్తుంటుంది. అలా ఆమె తమిళంలో స్వరపర్చి, పాడి, నటించిన ఒక పాటలో లోకేష్ ఆమెకి లవర్ గా అదరగొట్టాడు. అతని నటన చూసి ఇక సినిమాల్లో హీరోగా నటించమని అడుగుతున్నారట.
“ఖైదీ”, “మాస్టర్”, “విక్రమ్”, “లియో” వంటి సినిమాలు తీసిన లోకేష్ తన తదుపరి చిత్రంగా రజినీకాంత్ తో మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పేరుని వచ్చే వారం ప్రకటిస్తారు.