
ఇప్పుడంటే పాన్ ఇండియా అనే పేరు వచ్చింది కానీ మణిరత్నం, శంకర్ వంటి దర్శకులు ఎప్పటి నుంచో తమ సినిమాలను వివిధ భాషల్లో విడుదల చేస్తూ వస్తున్నారు. మణిరత్నం తీసిన “రోజా”, “బొంబాయి” వంటి చిత్రాలు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సూపర్ డూపర్ హిట్టయ్యాయి. శంకర్ తన తొలి చిత్రం “జెంటిల్ మేన్” నుంచి ప్రతి సినిమాని తమిళంతో పాటు తెలుగులో విడుదల చేశారు.
ఇక కమల్ హాసన్ హీరోగా ఆయన 1996లో తీసిన “ఇండియన్” చిత్రం ఒకేసారి తమిళం, హిందీ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలైంది. విజయం సాధించింది. కానీ అప్పట్లో ఏ భాషలో డబ్ చేస్తే ఆ భాషకు అనుగుణంగా టైటిల్ పెట్టేవారు. తమిళ్, ఇతర భాషల్లో ఆ సినిమాకి “ఇండియన్” అనే పేరు పెట్టగా, తెలుగులో “భారతీయుడు”, హిందీలో “హిందూస్తాని” అనే పేరు పెట్టారు.
ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్న ప్రతి సినిమాకి ఒకే టైటిల్ ఉంటోంది. రామ్ గోపాల్ వర్మ తీసిన రక్త చరిత్రతో మొదలైంది. “బాహుబలి” నుంచి అది బాగా పాపులర్ అయింది.
ఐతే, దర్శకుడు శంకర్ ఈ సినిమా విషయంలో మాత్రం పాత పద్దతిలోనే వెళ్తున్నారు. హిందీలో “హిందూస్థాని 2” అని, తెలుగులో “భారతీయుడు 2” అనే పేరు ఖరారు చేశారు.
కమల్ హాసన్ టైటిల్ రోల్ లో కనిపించే ఈ మూవీ జూన్ లో విడుదల కానుంది. ఈ రోజు అన్ని భాషల పోస్టర్లను విడుదల చేశారు. “జీరో టోలరెన్స్” అనే ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. అలాగే “సేనాపతి రిసర్రెక్ట్స్” అనే హాష్టగ్ కూడా ఉంది.