దర్శకుడు క్రిష్ … పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న “హరి హర వీరమల్లు” నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు ఆ సినిమాని నిర్మాత ఏ. ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ పూర్తి చెయ్యనున్నారు. ఈ విషయాన్ని నిన్న (మే 2, 2024)న నిర్మాతలు ప్రకటించారు. కొత్త టీజర్ కూడా వచ్చింది.
ఐతే, దీని గురించి క్రిష్ అస్సలు పట్టించుకోలేదు. కొత్త టీజర్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యలేదు. తాను ఈ సినిమా నుంచి తప్పుకున్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు.
“హరి హర వీరమల్లు” సినిమా మొదటి నుంచి అనేక సమస్యలు ఎదుర్కొంది. ఈ సినిమా కరోనా కాలం కన్నా ముందే మొదలైంది. కానీ, ఈ సినిమాకి డేట్స్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్”, “బ్రో” సినిమాలు పూర్తి చేశారు. దాంతో, విసుగెత్తిన క్రిష్ సినిమా నుంచి తప్పుకున్నారు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే వైష్ణవ్ తేజ్ హీరోగా క్రిష్ “కొండపొలం” అనే సినిమా విడుదల చేశారు. ఇప్పుడు అనుష్క హీరోయిన్ గా “గాటి” అనే సినిమా తీస్తున్నారు.
నిర్మాత రత్నం, హీరో పవన్ కల్యాణ్ లతో క్రిష్ కి తీవ్రమైన గొడవలు లేదా అభిప్రాయ వైరుధ్యాలు ఉన్నట్లు అర్థం అవుతోంది.
పైగా క్రిష్ కి ఈ మధ్య విజయాలు లేవు. ఆయన గత చిత్రాలు “ఎన్టీఆర్: మహానాయకుడు”, “కొండపొలం” వంటివి దారుణ పరాజయం పాలు అయ్యాయి. సో, క్రిష్ కూడా ‘డిమాండ్’లో లేడు.