జనసేన అధినేత, ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ కి ఓటమి భయం పట్టుకొంది అని అంటున్నారు యాంకర్ శ్యామల. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం మనకు తెలుసు. ఇప్పటికే హోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ కళ్యాణ్ తరఫున ఆయన కుటుంబ హీరోలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
పిఠాపురంలో ఎక్కడా చూసిన జనసేన జెండాలే కనిపిస్తున్నాయి. జనం నుంచి కూడా స్పందన బాగుందనేది టాక్. ఈసారి పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అని జనసేన వర్గాలు చెపుతున్నాయి.
ఐతే, శ్యామల మాత్రం పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతారు అని అంటున్నారు. వైసీపీ నాయకురాలు వంగా గీత పవన్ కళ్యాణ్ పై గెలుస్తారు అనేది ఆమె అభిప్రాయం.
“పవన్ కళ్యాణ్ కి ఓడిపోతాననే భయం పట్టుకోవడం వల్లే రోజుకో తమ కుటుంబ హీరోని పిఠాపురం రప్పించి ప్రచారం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కున్న ఇమేజ్ ప్రకారం ఎవరూ ప్రచారం చేయకున్నా గెలవాలి కదా. ఈ హీరోల ప్రచారం బట్టే అర్థం అవుతోంది ఆయన భయం ఎలా ఉందో” అనే వాదన వినిపిస్తున్నారు శ్యామల.
శ్యామల చాలాకాలంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి మద్దతుదారుగా ఉన్నారు. ఈ సారి కూడా ఆమె వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆమె పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి గీత తరఫున ప్రచారం చేస్తూ పవన్ కళ్యాణ్ పై ఈ కామెంట్స్ చేశారు.