“బాహుబలి” చిత్రం నుంచి తెలుగులో రెండు భాగాలుగా సినిమాలు తీయడం అనే ట్రెండ్ ఊపందుకొంది. ఇక లేటెస్ట్ గా సగం సినిమా పూర్తి చేశాక దర్శకులకు తమ కథని రెండు భాగాలుగా మలచాలి అనే క్రేజ్ పట్టుకొంది. ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న పలు పెద్ద చిత్రాలు అన్నీ సగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత రెండో భాగం ఉంటుంది అని అనౌన్స్ చేసినవే.
దేవర 1, 2
ఎన్టీఆర్ హీరోగా “దేవర” సినిమాని దర్శకుడు కొరటాల శివ ఒక భాగంగానే మొదలుపెట్టారు. కొంత భాగం షూటింగ్ పూర్తి అయ్యాక, ఆయనకి ఉన్నట్టుండి రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చింది. “ఈ కథకున్న కాన్వాస్ రెండు భాగాల్లో చెప్పితేనే న్యాయం చెయ్యగలం” అని “జ్ఞానోదయం” కలిగిందట. అలా “దేవర 1” ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్ 10న విడుదల కానుంది.
సలార్ 1, 2
“సలార్” విషయంలో కూడా అలాగే జరిగింది. ఇది మరీ విచిత్రం… షూటింగ్ దాదాపు పూర్తి అయ్యాక కథలో కన్ఫ్యూజన్ చాలా ఉంది అని నటుడు పృథ్వీరాజ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కి చెప్పాడట. సో అప్పటికప్పుడు రెండో భాగం చెయ్యాలి అని ఫిక్స్ అయ్యారు. ఒరిజినల్ ఆలోచన ప్రకారం మనం చూసిన “సలార్” క్లైమాక్స్… కథలో ఇంటర్వెల్. ఇంటర్వెల్ తర్వాత జరిగే కథని ఇప్పుడు రెండో భాగం చేశారు. త్వరలోనే “సలార్ 2” తీయబోతున్నారు.
భారతీయుడు 2, 3
శంకర్, కమల్ హాసన్ మొదలుపెట్టిన “భారతీయుడు 2” షూటింగ్ మొదలుపెట్టిన కొన్నాళ్లకే ఆగిపోయింది. శంకర్ తాను ప్రతిపాదించిన బడ్జెట్ ని మొత్తం సగం పూర్తి కాకముందే ఖర్చు పెట్టారు అని నిర్మాత ఆరోపించారు. దాంతో, శంకర్, నిర్మాణ సంస్థ లైకాకి పెద్ద గొడవ జరిగింది. షూటింగ్ ని నిలిపివేశారు. దాంతో, శంకర్ ఆ కోపంలో రామ్ చరణ్ తో “గేమ్ ఛేంజర్”, రణవీర్ సింగ్ తో ఒక బాలీవుడ్ మూవీ అనౌన్స్ చేశారు. అలా “గేమ్ ఛేంజర్” సెట్స్ పైకి వచ్చింది. ఐతే ఆ తర్వాత కొన్నాళ్ళకు కమల్ హాసన్ నటించిన “విక్రమ్” సినిమా తమిళనాడులో ఆల్ టైం బిగ్ హిట్ అయింది. దాంతో, కమల్ హాసన్ సినిమాలకు మళ్ళీ మార్కెట్ ఉంది అని అర్థమైంది.
అలా ఆగిపోయిన “భారతీయుడు 2″ని శంకర్, కమల్ హాసన్ మళ్ళీ మొదలుపెట్టారు. ఈ సారి భారీ బడ్జెట్ ని రికవరీ చెయ్యడానికి ఒకేసారి “భారతీయుడు 2”, “భారతీయుడు 3” సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. అవును “భారతీయుడు 3” అనేది కేవలం తమ ఖాతాల్లోకి లాభాల కోసం కమల్, శంకర్ వేసిన ప్లాన్.
హరి హర వీర మల్లు 1, 2
“హరి హర వీర మల్లు”ది కూడా ఆగి, ఆగి, సాగి, బడ్జెట్ తడిసి మోపడైన వైనమే. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు క్రిష్ మొదలుపెట్టిన “హరి హర వీర మల్లు” దాదాపు మూడున్నర ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. ఇప్పటివరకు ముందు అనుకున్న కథ ప్రకారం ఇంటర్వెల్ వరకు అయింది. ఇంటర్వెల్ తర్వాతి సీన్లు తీసి విడుదల చేస్తే నిర్మాతకు మిగిలేది అప్పులే. అందుకే, హడావిడిగా రెండో భాగం అనౌన్స్ చేశారు.
ఇప్పుడు ఇంటర్వెల్ వరకు తీసిన సినిమాని మొదటి భాగంగా విడుదల చేస్తారు.
పుష్ప 2
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న “పుష్ప 2” తీరు అంతే. దర్శకుడు సుకుమార్ కి సినిమా సగం షూటింగ్ అయ్యాక ఈ కథని “పుష్ప: ది రైజ్”, “పుష్ప 2 ది రూల్” అని తీయాలనుకున్నారు. ఎందుకంటే మొదటి భాగంతో బడ్జెట్ లాగలేం అని. మొదటి భాగం హిట్ అయితే రెండో భాగానికి తెగ క్రేజ్ వస్తుందనే ఆలోచన. “పుష్ప 2″కి ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ బిజినెస్ జరుగుతోంది మరి. సో, సుకుమార్ ఎత్తుగడ వర్కవుట్ అయింది.
ఇంకా మరికొన్ని…
“కల్కి 2898 AD” కూడా రెండు భాగాలుగా తీయనున్నారు అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంలో ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఓవరాల్ గా చూస్తే మొదటి భాగం హిట్టయితే రెండో భాగానికి క్రేజ్ వస్తుంది, బిజినెస్ బాగా జరిగి భారీగా లాభాలు హీరో, దర్శకుడు, నిర్మాత పంచుకోవచ్చనే ఆలోచన ఎక్కువైంది. అందుకే ఈ రెండో భాగం పిచ్చి.