హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రహస్య వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. కర్నాటకలోని కూర్గ్ లో వీళ్ల వివాహం అట్టహాసంగా జరిగింది. పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి తన ప్రేయసి రహస్య మెడలో మూడు ముళ్లు వేశాడు కిరణ్ అబ్బవరం.
రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగింది కిరణ్-రహస్య వివాహం. బుధవారం ఇద్దరూ కలిసి ఆహుతులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పెళ్లి తంతు మొదలైంది. రాత్రి సంగీత్ ముగియగా.. గురువారం ఉదయం నుంచి అసలైన పెళ్లి పనులు మొదలయ్యాయి.
ఇక కల్యాణ మండపం దగ్గరకు, రహస్యను సంప్రదాయపద్ధతిలో బుట్టలో కూర్చోబెట్టి తీసుకొచ్చారు. అటు కిరణ్ అబ్బవరంకు, వాళ్ల సంప్రదాయం ప్రకారం తలపాగా పెట్టి, ఊరేగింపుగా మంటపానికి తీసుకొచ్చారు. వేదమంత్రాల మధ్య రహస్య తలపై జీలకర్ర-బెల్లం పెట్టాడు కిరణ్. ఆ తర్వాత తాళి కట్టడంతో పెళ్లి తంతు పూర్తయింది.
వీళ్ల పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతూనే ఉన్నాయి.
“రాజావారు రాణిగారు” సినిమాతో కలిశారు కిరణ్-రహస్య. ఇద్దరికీ అదే తొలి సినిమా. ఆ సినిమా సక్సెస్ అయింది. అదే టైమ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిన వీళ్లు.. ఆ తర్వాత మనసులు కలిసి ప్రేమలో పడ్డారు. చాన్నాళ్ల పాటు తన ప్రేమ వ్యవహారాన్ని సీక్రెట్ గా ఉంచిన కిరణ్ అబ్బవరం.. రీసెంట్ గా బయటపడ్డాడు. ఆ వెంటనే రహస్యతో ఎంగేజ్ మెంట్ పూర్తి చేశాడు. ఇప్పుడు మూడు ముళ్లు వేసి, తన అర్థాంగిని చేసుకున్నాడు.