కియారా అద్వానీ దశ తిరిగింది. అన్నీ పెద్ద చిత్రాలే ఆమె ఖాతాలో పడుతున్నాయి. ఇప్పటికే నాలుగు పాన్ ఇండియా చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి వచ్చి చేరుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ అమ్మడికి ఒక ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందట. ఐటెం సాంగ్ అంటే అలాంటి ఇలాంటి చిత్రంలో కాదు. ప్రభాస్ హీరోగా రూపొందే “సలార్ 2” చిత్రంలో.
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన “సలార్” మంచి విజయం సాధించింది. ఇటీవల ప్రభాస్ కి సరైన హిట్ పడలేదు. అలాంటి టైంలో “సలార్” సూపర్ సక్సెస్ అయింది. అమెరికాలోనే 9 మిలియన్ల డాలర్లని పొందింది. అందుకే, “సలార్ 2” వెంటనే మొదలుపెట్టాలని పట్టుదలతో ఉన్నాడు ప్రభాస్. దానికి తగ్గట్లే ప్రశాంత్ నీల్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు.
“సలార్” సినిమాలో శృతి హాసన్ హీరోయిన్. రెండో భాగంలో కూడా ఆమె ఉండాలి. ఐతే, ఈ సినిమాకి మరింత గ్లామర్ తెచ్చేందుకు కియారా అద్వానీ తో ఐటెం సాంగ్ చేయించాలని నీల్ డిసైడ్ అయ్యారట. మరి ఈ అమ్మడు ఒప్పుకుందా లేదా అనేది చూడాలి.
అన్నీ బడా చిత్రాలే!
కియారా అద్వానీ చేతిలో అన్నీ బడా చిత్రాలే. తెలుగులో ఆమె రామ్ చరణ్ సరసన “గేమ్ ఛేంజర్”లో నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో “వార్ 2”, “డాన్ 3” సినిమాలు ఉన్నాయి ఆమెకి.
అలాగే కన్నడంలో ఆమె యష్ సరసన “టాక్సిక్” అనే సినిమా ఒప్పుకొంది. ఇప్పుడు “సలార్ 2” కూడా ఆమె ఖాతాలో చేరితే వరుసగా ఇదో పాన్ ఇండియా మూవీ ఆమె చేస్తున్నట్లు అవుతుంది. కియారాకి అంత క్రేజుంది. ఆమె ఇటీవలే బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకొంది. పెళ్లి తర్వాత ఆమె జోరు తగ్గుతుందని భావించారు చాలామంది. కానీ విచిత్రంగా ఆమెకి ఇప్పుడే పెద్ద పెద్ద పాన్ ఇండియా చిత్రాలు దక్కుతున్నాయి.