రోజురోజుకు నెగెటివ్ టాక్ పెరిగిపోవడంతో ‘కంగువా’ టీమ్ వెనక్కు తగ్గక తప్పలేదు. మొన్నటివరకు నిడివిపై భీష్మించుకొని కూర్చున్న యూనిట్, ఇప్పుడు వెనకడుగేసింది. ఫీడ్ బ్యాక్ ఆధారంగా సినిమా నిడివి తగ్గించింది. ఒకట్రెండు నిమిషాలు కాదు, ఏకంగా సినిమా నుంచి 12 నిమిషాలు కట్ చేసింది.
ఇప్పుడు సినిమా రన్ టైమ్ 2 గంటల 22 నిమిషాలు మాత్రమే. ట్రిమ్ చేసిన వెర్షన్ ఆల్రెడీ అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా రిలీజైన మొదటిరోజే నెగెటివ్ టాక్ వచ్చింది. సినిమాలో సౌండ్ సిస్టమ్ బాగాలేదని, రన్ టైమ్ ఎక్కువైందంటూ విమర్శలు చెలరేగాయి. సౌండ్ ఇష్యూస్ ను సరిచేసిన యూనిట్, నిడివి తగ్గించడానికి మాత్రం ఇష్టపడలేదు.
ఎట్టకేలకు సినిమా విడుదలైన 4 రోజుల తర్వాత రన్ టైమ్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. సినిమాలో గోవా ఎపిసోడ్ కు సంబంధించిన సన్నివేశాల్ని ఎక్కువగా కట్ చేశారు. ఇంకా చెప్పాలంటే సూర్య, దిశా పటానీ కాంబోలో తెరకెక్కిన సన్నివేశాలు ఎక్కువగా కట్ అయ్యాయి.
తాజా మార్పు వల్ల ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని మేకర్స్ ఆశిస్తున్నారు. అయితే ఇప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఈ నిర్ణయం జీవితకాలం లేటు అంటున్నారు నెటిజన్లు.