లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్ తిరిగి జైలుకు చేరుకున్నాడు. 4 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో జానీ మాస్టర్ ను కోర్టులో హాజరుపరిచి అట్నుంచి అటు చంచల్ గూడ జైలుకు తరలించారు.
పోలీసులు, అతడిపై మరోసారి విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేయకపోవడం విశేషం. కోర్టు ముందు హాజరైన జానీ మాస్టర్ కు జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ, కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 3వ తేదీ వరకు అతడు జైళ్లోనే ఉంటాడు.
ఈనెల 25న జానీ మాస్టర్ ను తమ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదును ముందు పెట్టుకొని జానీ మాస్టర్ ను సుదీర్ఘంగా విచారించారు. బాధితురాలి ఆరోపణల్ని ఖండించిన జానీ మాస్టర్, బాధితురాలే తనను మానసికంగా వేధించినట్టు పోలీసులకు వెల్లడించాడు.
ఈ క్రమంలో సుకుమార్ పేరును కూడా అతడు ప్రస్తావించాడు. తామిద్దరి మధ్య వివాదం చెలరేగితే ఓ టైమ్ లో సుకుమార్ కలుగజేసుకొని మాట్లాడాడని, బాధితురాలి ప్రవర్తన, ఆమె మోసపూరిత ఆలోచనలన్నీ సుకుమార్ కు తెలుసని వెల్లడించాడు. దీంతో ఈ కేసులో సుకుమార్ ను కూడా పోలీసులు విచారించే అవకాశం ఉంది.
మైనర్ గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదుచేసిన సంగతి తెలిసిందే, దీంతో జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇలాంటి కేసుల్లో బెయిల్ రావడం కాస్త కష్టమైన వ్యవహారం.