కొరియోగ్రఫీలో రివర్స్ స్టెప్ తో జానీ మాస్టర్ పాపులర్. కొన్ని డాన్స్ మూమెంట్స్ చూస్తే, అది జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అని ఈజీగా చెప్పేయొచ్చు. ఇప్పుడు తన నిజజీవితం వివాదంలో కూడా జానీ మాస్టర్ తనదైన రివర్స్ యాంగిల్ జోడించారు.
మొన్నటివరకు జానీ మాస్టర్ దగ్గర కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఓ అమ్మాయి, అతడిపై లైంగిక వేధింపుల కేసు పెట్టిన సంగతి తెలిసిందే. తను మైనర్ గా ఉన్నప్పుడే తనపై అత్యాచారం చేశాడనని, లైంగికంగా పలుమార్లు వేధించాడంటూ ఆమె ఆరోపణలు చేసింది.
ఇప్పుడు కేసును జానీ మాస్టర్ తనదైన శైలిలో ఎదుర్కొంటున్నాడు. 2 రోజులుగా పోలీసు విచారణ ఫేస్ చేస్తున్న ఈ కొరియోగ్రాఫర్, తను ఎలాంటి వేధింపులు చేయలేదని, సదరు బాధితురాలే తనను మానసికంగా వేధించిందని ఆరోపించడం విశేషం.
బాధితురాలికి ప్రొఫెషనల్ కెరీర్ ఇచ్చిందే జానీ మాస్టర్. ఈ క్రమంలో జానీపై ఆమె ఇష్టం పెంచుకుందంట. పెళ్లి చేసుకోమని వెంటాడి వేధించిందట. ఒక దశలో తనపై బెదిరింపులకు కూడా పాల్పడిందనేది జానీ మాస్టర్ వెర్షన్.
ఇలా బాధితురాలిపై రివర్స్ ఎటాక్ మొదలుపెట్టాడు జానీ మాస్టర్. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. పోలీసులు తాము చేయాల్సిన డ్యూటీ చేస్తున్నారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసు కాబట్టి, జానీ మాస్టర్ కు బెయిల్ రావడం కొంచెం కష్టం అంటున్నారు లాయర్లు.