జానీ మాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు పడింది. అతడ్ని గోవాలో అరెస్ట్ చేశారు. అంతవరకు ఓకే. ఆ తర్వాత ఈ కేసులో రకరకాల ట్విస్టులు బయటపడుతున్నాయి. మరీ ముఖ్యంగా జానీ మాస్టర్ కేసులో ఇప్పుడు విశ్వక్ సేన్ పేరు, ఓ సినిమా ప్రధానంగా తెరపైకొచ్చాయి. విశ్వక్ సేన్ సినిమా నుంచే జానీ మాస్టర్ కు, బాధితురాలికి మధ్య అభిప్రాయబేధాలొచ్చాయంటున్నారు.
ఆ రోజు ఏం జరిగిందంటే.. ఎప్పట్లానే విశ్వక్ సేన్ సినిమా సాంగ్ షూటింగ్ కు కొరియోగ్రఫీ చేయడానికి వచ్చిందంట బాధితురాలు. షెడ్యూల్ ప్రకారం ఆరోజు 30 నుంచి 35 షాట్స్ తీయాల్సి ఉంది. పరిస్థితులు అనుకూలించకపోతే కనీసం 15 షాట్స్ అయినా తీయాలి. కానీ బాధితురాలు మాత్రం తన కొరియోగ్రాఫీలో కేవలం 7 షాట్స్ మాత్రమే తీసిందంట.
దీంతో విశ్వక్ తో పాటు, నిర్మాత కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆ వెంటనే ఆమెను తీసేసి, మరుసటి రోజు నుంచి మరో మాస్టర్ ను తెచ్చుకున్నారట.
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆరోజు బాధితురాలు అన్ని తక్కువ షాట్స్ తీయడానికి కారణం జానీ మాస్టర్ అంట. పనిలో ఉన్నప్పుడు జానీ మాస్టర్, బాధితురాల్ని చాలా ఇబ్బంది పెట్టాడట. దీంతో ఆమె వర్క్ పై ఫోకస్ పెట్టలేక, ఆ రోజు షూటింగ్ చెడగొట్టిందని ఓ వర్గం చెబుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్ ను జానీ మాస్టర్ భార్య సుమలత ఖండిస్తున్నారు.
“ఆ అమ్మాయి వర్క్ నచ్చక విశ్వక్ సినిమా నుంచి పంపించేశారు. వర్క్ నచ్చనప్పుడు లక్షల్లో నష్టం వస్తుంది కదా, అందుకే వెంటనే తీసేసి మరో డాన్స్ మాస్టర్ ను తెచ్చుకున్నారు. అది ఆమె మనసులో పెట్టుకున్నట్టుంది. నిజానికి ఆ ఇష్యూకు జానీ మాస్టర్ కు ఎలాంటి సంబంధం లేదు. ఆ అమ్మాయి ఏ పాట చేయకపోయినా దానికి జానీ మాస్టర్ ఎలా కారణం అవుతారు. ఆ అమ్మాయిని ఎవ్వరూ ఆపలేదు. ఆమెకు అసోసియేషన్ కార్డు కూడా మేమే ఇప్పించాం. మేమెందుకు ఆమె కెరీర్ ను ఆపుతాం.”
ఇలా ఊహించని విధంగా జానీ మాస్టర్ కేసులో విశ్వక్ సేన్ పేరు తెరపైకొచ్చింది. ప్రస్తుతం జానీ మాస్టర్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. అతడికి కోర్టు 2 వారాల రిమాండ్ విధించింది.