
ఇదొక అరుదైన కలయిక. తమతమ లోకాల్లో బిజీగా ఉండే ఇద్దరు ప్రముఖులు కలిశారు. అప్యాయంగా పలకరించుకున్నారు, మాట్లాడారు. వాళ్లే మ్యాస్ట్రో ఇళయరాజా, ప్రధాని నరేంద్రమోదీ. ఇళయరాజాకు సంగీతమే ప్రపంచం, మోదీకి లెక్కలేనన్ని పనులు. ఇలాంటి రెండు విభిన్నమైన రంగాలకు చెందిన ఇద్దరు కలవడం అందర్నీ ఆకర్షించింది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇళయరాజాను కలవాలని అనుకుంటున్నారట మోదీ. అటు ఇళయరాజా కూడా అంతే ఆశగా ఎదురుచూశారు. ఇన్నాళ్లకు ఈ మర్యాదపూర్వక భేటీ సాధ్యమైంది. ఈమధ్య లండన్ వెళ్లి మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించారు ఇళయరాజా. లండన్ లో వెస్ట్రన్ క్లాసికల్ సింఫనీ నిర్వహించిన తొలి ఆసియా కంపోజర్ గా ఆయన రికార్డ్ సృష్టించారు. ఆ విషయాన్ని మోదీతో షేర్ చేసుకున్నారు ఇళయరాజా.
త్వరలోనే మరో 13 దేశాల్లో క్లాసికల్ సింఫనీ నిర్వహించే ఆలోచనను ఇళయరాజా బయటపెట్టారు. మరోవైపు ఇళయరాజాను సంగీత జ్ఞానిగా కొనియాడారు మోదీ.
ఇళయరాజాను ఇటీవల మోదీ ప్రభుత్వం రాజ్యసభకు “కళాకారుల కోటా”లో నామినేట్ చేసింది. ఈ రోజు ఆయన రాజ్యసభలో కూర్చున్నారు. అలా ఎంపీగా ఆయనకి ప్రధానితో మీటింగ్ సులువైంది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి.
ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కర్ రాజాని అభినందిస్తూ సభలో ప్రశంసపత్రం చదివారు. 8600 పాటలకు సంగీతం అందించారు అని, 1000కి పైగా సినిమాలకు స్వరాలు కూర్చిన ఏకైక సంగీత దర్శకుడు అని కొనియాడారు.