
ఎట్టకేలకు “గేమ్ ఛేంజర్” సినిమా కొలిక్కి వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ పోర్షన్, వచ్చే వారంతో పూర్తవుతుంది. అంతేకాదు, సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి అయినట్టే. గడిచిన కొన్ని రోజులుగా గోదావరి తీర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. నిన్నట్నుంచి సినిమా యూనిట్ వైజాగ్ కు షిఫ్ట్ అయింది. ఈరోజు కూడా వైజాగ్ లోనే షూటింగ్ జరిగింది.
ఇదే షెడ్యూల్ ను ఆదివారం నుంచి హైదరాబాద్ లో కొనసాగిస్తారు. ఆదివారం నుంచి 3 రోజుల పాటు ఈ షూట్ ఉంటుంది. అక్కడితో రామ్ చరణ్ పోర్షన్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ప్యాచ్ వర్క్ షూట్ నడిచే అవకాశం ఉంది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను రీషూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమా విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
దర్శకుడు శంకర్ తో భారీ సినిమా తీయాలనేది దిల్ రాజు కల. అందుకే, ఆయన ఈ భారీ సినిమాని మొదలుపెట్టారు. కానీ సినిమా షూటింగ్ ఆలస్యం అయి, బడ్జెట్ తడిసి మోపెడయింది. ఆ చికాకు ఉన్నా… సినిమా పెద్ద హిట్ అయితే కష్టాలు అన్నీ మర్చిపోవచ్చు. ఆ ఆశతో ఉన్నారు దిల్ రాజు.
ఇక రామ్ చరణ్ కూడా ఊపిరి పీల్చుకుంటారు. మూడున్నరేళ్లుగా ఇదే సినిమా సెట్స్ పై ఉన్నారు రామ్ చరణ్. ఇక ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు తీసే సినిమా మొదలెడతారు చరణ్.