‘గేమ్ ఛేంజర్’ సినిమా విడుదలకు సిద్ధమౌతోంది. ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను అమెరికాలోని డాలస్ లో నిర్వహించారు. అది బ్లాక్ బస్టర్ హిట్టయింది. ఇప్పుడు మరో వినూత్న ప్రయోగం చేసింది ‘గేమ్ ఛేంజర్’ యూనిట్.
తొలిసారి యూకే లో ఫ్యాన్ షో ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లూ బెనిఫిట్ షోలు తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాగా, తొలిసారి యూకేలో ఓ తెలుగు సినిమా ప్రీమియర్ ఏర్పాటుచేయడం విశేషం. ఈ ఫ్యాన్ షోకు సంబంధించి టిక్కెట్లన్నీ అమ్ముడుపోవడం మరో విశేషం. రామ్ చరణ్ కు ఇతర దేశాల్లో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.
బ్రిటన్ లో ‘గేమ్ ఛేంజర్’ సినిమాను డ్రీమ్ జెడ్ ఈ సంస్థ రిలీజ్ చేస్తోంది. జనవరి 9న ఈ సినిమా ఫ్యాన్ షోను అక్కడ నిర్వహించబోతున్నారు. మరోవైపు యూఎస్ లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇటు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు, మిడ్ నైట్ షోలపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎలాంటి సమస్య లేదు. రేపోమాపో అనుమతులు వచ్చేస్తాయి. ఎటొచ్చి తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంపైనే అందరి దృష్టి ఉంది. ‘పుష్ప-2’ రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన నేపథ్యంలో, ఇకపై ప్రత్యేక అనుమతులు ఇవ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.