విజువల్ వండర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ సినిమాపై ఓ డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. ఇందులో రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి మరిన్ని విషయాలు వెల్లడించారు. మరీ ముఖ్యంగా సినిమాలోని ఓ షాట్ పై రాజమౌళి చెప్పిన విషయాలు, ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఎపిసోడ్ కోసం యూనిట్ పడిన కష్టాన్ని రాజమౌళి చెప్పిన తీరు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. వందల మంది మధ్య ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రామ చరణ్ ఎంత కష్టపడ్డాడో జక్కన్న వివరించాడు. మరీ ముఖ్యంగా ఆ ఎపిసోడ్ లో ఓ షాట్ గురించి రాజమౌళి చెబితే, ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతయింది.
ఇంట్రడక్షన్ సీన్ లో చరణ్ గుంపును అదుపులో పెడతాడు. ఆ తర్వాత చరణ్ ను చూసిన వాళ్లంతా ఒక్కసారిగా వెనక్కు తగ్గుతారు. ఆ సీన్ ను చరణ్ కనుగుడ్డు నుంచి చూపించాడు రాజమౌళి. దాన్ని అంతా గ్రాఫిక్ అనుకున్నారు. కానీ అది సీజీ షాట్ కాదని, లైవ్ షాట్ అని జక్కన్న చెప్పడంతో అంతా ఆశ్చర్య పోయారు.
వందలమంది ఉన్న గంపు ఒక్కసారిగా వెనక్కు తగ్గే సన్నివేశాన్ని చరణ్ కళ్ల నుంచి షూట్ చేయడం సాధారణమైన విషయం కాదు. రెప్ప వాల్చకుండా చరణ్ అలానే నిల్చోవాలి. ఒక్క అడుగు కూడా అటుఇటు కదలకూడదు. పైగా కళ్లలో ఆ కోపాన్ని ప్రదర్శించాలి. అలాంటి టైమ్ లో చరణ్ కనుగుడ్డుపై కెమెరా పెట్టి ఆ సీన్ తీయడం ఎంత కష్టమో, మేకింగ్ వీడియోలో బయటపడింది. ఇలాంటి షాట్స్ లెక్కలేనన్ని ‘ఆర్ఆర్ఆర్’లో ఉన్నాయి. ఓ సినిమాకు రాజమౌళి ఎందుకింత టైమ్ తీసుకుంటాడో ఈ డాక్యుమెంటరీతో అందరికీ తెలిసొచ్చింది.