
తెలుగు సినిమా రంగంలో అగ్ర నిర్మాణ సంస్థలుగా రాణిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయాలపై, ఆ సంస్థ అధినేతల, ప్రతినిధుల ఇళ్లపై ఐటీ దాడులు జరుగుతున్నాయి. దిల్ రాజు, శిరీష్, దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాలపై ఏకకాలంలో ఐటి సోదాలు జరుగుతున్నాయి.
ఇటు మైత్రి సంస్థ అధినేతలైన నవీన్ ఎర్నేని, రవికుమార్, సిఇఒ చెర్రీ ఇళ్లల్లోనూ సోదాలు అవుతున్నాయి.
ALSO READ: IT raids on Dil Raju and Mythri offices
సంక్రాంతి బరిలో దిగిన “గేమ్ చేంజర్”, “సంక్రాంతికి వస్తున్నాం” చిత్రాలను దిల్ రాజుకి చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మించింది. “పుష్ప 2” సినిమాని మైత్రి సంస్థ తీసింది. ఐతే, “సంక్రాంతికి వస్తున్నాం” ఇప్పటికే 130 కోట్లు కలెక్ట్ చేసింది అని, త్వరలో 200 కోట్లకు పైనే చేస్తుంది అని నిర్మాతలు పోస్టర్లు విడుదల చెయ్యడం, కొందరు జర్నలిస్టులతో ట్వీట్లు వేయించడమే ఈ తిప్పలు అని అర్థమవుతోంది. అలాగే అట్టర్ ఫ్లాప్ అయిన “గేమ్ చేంజర్” కూడా దాదాపు 270 కోట్లు కలెక్ట్ చేసింది అని దిల్ రాజు పోస్టర్ వేశారు.
అటు మైత్రి సంస్థ కూడా దాదాపు “పుష్ప” సినిమా 1900 కోట్లు కలెక్ట్ చేసింది అని పోస్టర్లు విడుదల చేసింది. “సంక్రాంతికి వస్తున్నాం”, “పుష్ప 2” రెండూ భారీ విజయాలే. కానీ వచ్చిన వసూళ్లకు మించి…. చాలా అదనంగా అమౌంట్ కలిపి పోస్టర్లు వేస్తున్నారు. ఇదంతా పబ్లిసిటీ కోసం. ఈ పబ్లిసిటీ వల్లే ఐటీ తిప్పలు మొదలు అయ్యాయి అని ఇండస్ట్రీలో కామెంట్స్ వినపడుతున్నాయి.