సూపర్ స్టార్ రజినీకాంత్ ని టార్గెట్ చేస్తూ తమిళనాడు అధికార పార్టీ డీఎంకేకి చెందిన సీనియర్ నేత దురై మురుగన్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. “తెల్ల గడ్డం వేసుకొని పళ్ళు ఊడిన ముసలి హీరోలు ఇంకా నటిస్తుండడం వల్ల యువ నటులకు అవకాశాలు రాకుండా పోతున్నాయి,” అని దురై మురుగన్ కామెంట్ చేశారు.
డీఎంకె పార్టీలో చాలా సీనియర్ నేత, మంత్రి దురై మురుగన్. ఆయన సడెన్ గా రజినీకాంత్ ని ఇలా విమర్శించడం వెనుక కారణం ఉంది.
ఇటీవల ఒక పుస్తక ఆవిష్కరణ సభలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ని పొగుడుతూ రజినీకాంత్ ప్రసంగం చేశారు. “కరుణనిధి చనిపోయిన తర్వాత స్టాలిన్ పార్టీని అద్భుతంగా నడిపారు. వరుస విజయాలు సాధించారు. ఒక టీచర్ కి పాఠశాలలోని కొత్త విద్యార్థులను మేనేజ్ చెయ్యడం సులువు. కానీ పాత విద్యార్థులను, పాతుకుపోయిన వారిని గాడిలో పెట్టడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా ఈ డీఎంకే అనే పార్టీ పాఠశాలలో దురై మురుగన్ వంటి ఓల్డ్ గార్డ్స్ ని మేనేజ్ చెయ్యడం అంటే మాటలా. స్టాలిన్ గారు మీకు హ్యాట్సాఫ్,” అంటూ రజినీకాంత్ అన్నారు.
రజినీకాంత్ దురై మురుగన్ ని తిట్టలేదు. స్టాలిన్ ని పొగిడారు. దురై వంటి సీనియర్లతో మంచిగా ఉంటూ పార్టీకి విజయాలు అందించినందుకు స్టాలిన్ ని పొగిడారు తప్ప దురైని విమర్శించలేదు. ఐతే, దురై మాత్రం రజినీకాంత్ వ్యాఖ్యలను నెగెటివ్ గా తీసుకున్నారు. తనని “ఓల్డ్ గార్డ్” అన్నదుకు కోపం వచ్చింది.
“పళ్లూడిన తాతలు” హీరోలుగా నటిస్తూ కొత్తవారికి అవకాశాలు లేకుండా చేస్తున్నారు అని రజినీకాంత్ పై కామెంట్ చేసారు దురై.