అల్లు అర్జున్ అరెస్ట్ అయి, ఒక రాత్రి జైలులో ఉండి ఈ రోజు ఉదయం విడుదల అయ్యారు. ఐతే, అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక చాలా రాజకీయమే నడిచింది అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని బన్నీ మరిచిపోవడం వల్లే ఆయన బన్నీపై కక్ష తీర్చుకున్నారు అని బీఆర్ ఎస్ నేతలు అంటున్నారు. సినిమా హీరోలు, సృజనాత్మక రంగానికి చెందిన వారిపై కాంగ్రెస్ పార్టీకి గౌరవం లేదని బీజేపీ విమర్శించింది.
మరోవైపు అల్లు అర్జున్ వ్యవహార శైలితో కోపం పెంచుకున్న రెండు రాజకీయ పార్టీలు, తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రభావితం చేశారని వైకాపా నేతలు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
వీటిని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే తోసిపుచ్చారు. థియేటర్ వద్ద అల్లు అర్జున్ చేసిన హడావిడి వల్లే ఒక ప్రాణం పోయింది అని, ప్రాణం పోయినప్పుడు కేసు పెట్టొద్దా అని ఆయన ఇండియాటుడే ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇందులో రాజకీయం లేదని చట్టబద్ధ చర్య మాత్రమే అని క్లారిటీ ఇచ్చారు.
ఐతే, అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే ఆనందంతో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బ్యాచ్ మొత్తం పైన పేర్కొన్న ఆ రెండు పార్టీల వారే అని సోషల్ మీడియా జనం ఎత్తి చూపుతున్నారు.
ముఖ్యంగా అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమాతో నార్త్ ఇండియాలో భారీ కలెక్షన్లు సాధించడం, అమెరికాలో 10 మిలియన్ల క్లబులో చేరడంతో ఈ బ్యాచ్ కి అసూయ పుట్టింది అని వారు పేర్కొంటున్నారు. అందుకే, సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఇన్సిడెంట్ ని తీసుకొని బన్నీని ఇరికించారు అనేది ఆరోపణ.