తెలుగు రాష్ట్రాల్లో “దేవర” సినిమాకు లైన్ క్లియర్ అయింది. సెన్సార్ క్లియర్ అవ్వడం కామన్, పెద్ద సినిమాలకు ప్రత్యేక అనుమతుల కింద జీవో వస్తే, అప్పుడు లైన్ క్లియర్ అయినట్టు లెక్క. ఈ విషయంలో “దేవర” సినిమాకు పూర్తిగా లైన్ క్లియర్ అయింది.
తెలుగు రాష్ట్రాల నుంచి “దేవర” సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు వచ్చేశాయి. సెప్టెంబర్ 26 అర్థరాత్రి 12 గంటల నుంచి 6 షోలు వేసుకోవడానికి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంటే బెనిఫిట్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు రాష్ట్రంలో ఉన్న థియేటర్లలో వేసుకోవచ్చన్నమాట. 28వ తేదీ నుంచి 9 రోజుల పాటు అంటే అక్టోబర్ 6వ తేదీ వరకు రోజుకు 5 ఆటలకు అనుమతి వచ్చింది.
ఏపీలో సింగిల్ స్క్రీన్స్ లో లోయర్ క్లాస్ కు 60 రూపాయల వరకు.. అప్పర్ క్లాస్ కు 110 రూపాయల వరకు పెంచుకునే అవకాశం దక్కింది. మల్టీప్లెక్సుల్లో 135 రూపాయల వరకు పెంచుకోవచ్చు.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. ఇక్కడ కూడా ఫ్లాట్ గా రేట్లు పెంచేశారు. 27వ తేదీన 29 థియేటర్లలో మిడ్ నైట్ షోలున్నాయి. ఆరోజు 6 షోలున్నాయి. 28వ తేదీ నుంచి ఉదయం 4 గంటల షోలు పెట్టుకోవచ్చు. ఆరోజు నుంచి రోజుకు 5 షోలు అన్నమాట. మొదటి రోజు ఫ్లాట్ 100 రూపాయలు పెంచగా.. రెండో రోజు నుంచి మల్టీప్లెక్సుల్లో 50 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో 25 రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ దక్కింది.
ఈ పెంపుతో మొదటి రోజు దేవర సినిమాకు భారీ వసూల్లు వచ్చే అవకాశం ఉంది. పెంచిన టికెట్ రేట్లతో పాటు, థియేటర్ల సంఖ్య కూడా పెరగడంతో.. దేవర సినిమా మొదటి రోజు నాన్-బాహుబలి, నాన్-ఆర్ఆర్ఆర్ రికార్డుల తర్వాత నిలిచే అవకాశం ఉంది. ఇక మొదటి వీకెండ్ గడిచేసరికి ఈ సినిమా మరిన్ని రికార్డులు సృష్టించేలా ఉంది. ఓవర్సీస్ వసూళ్లూ కూడా కలిపితే, మొదటి వారాంతం ఈ సినిమా ఆర్ఆర్ఆర్ ను క్రాస్ చేసే అవకాశం ఉంది.