ఈ కాలం ఓ సినిమా ఓటీటీలోకి ఇట్టే వస్తోంది. హిట్టయితే కాస్త లేటుగా, ఫ్లాప్ అయితే వెంటనే ఓటీటీలో ప్రత్యక్షమౌతోంది. ఈ విషయంలో ఫిలింఛాంబర్ నిబంధనల్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. నిర్మాతల్లో కీలకంగా వ్యవహరిస్తున్న బన్నీ వాస్ కూడా తను నిర్మించిన “ఆయ్” సినిమాను ఇలా ఓటీటీకి ఇచ్చేశాడు.
దీనిపై అడిగితే అతడు సూటిగా స్పందించాడు.
“అందరూ 21 రోజులు లేదా 28 రోజులకే ఓటీటీలకు తమ సినిమాలు ఇచ్చేస్తున్నారు. అలా కుదరదు, నేను థియేటర్లలో నా సినిమా రిలీజైన 35 రోజుల తర్వాత ఓటీటీకి ఇస్తానంటే ఓటీటీ సంస్థలు ఎందుకు తీసుకుంటాయి? 21 రోజులకే ఓటీటీకిచ్చే నిర్మాత దగ్గరకు వెళ్లిపోతాయి. అలాంటప్పుడు నేనెందుకు రూల్ పెట్టుకోవాలి. పైగా ఆయ్ లాంటి సినిమాకు ఓటీటీ ఆదాయమే నాకు ముఖ్యం. విడుదలకు ముందే నేను కనీసం 60 శాతం సేవ్ అవ్వాలంటే.. అందరిలా 21 రోజులకు ఓటీటీకి ఇచ్చేయాల్సిందే. నేనొక్కడ్నే 35 రోజులు, 50 రోజులు లాక్-ఇన్ అనుకుంటే కుదరదు, నాకే నష్టం.”
ఇలా ఓటీటీ రూల్స్ పై స్పందించాడు బన్నీ వాసు. ఈ విషయంలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు కలిసి కూర్చొని ఓ ఏకాభిప్రాయానికి రావాలని.. అప్పటివరకు ఓటీటీ రూల్స్ ను ఎవ్వరూ పట్టించుకోరని చెబుతున్నాడు.