కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదంటూ సంచలన ప్రకటన చేసి దుమారం రేపింది ఐశ్వర్య రాజేష్. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ మొదలైంది. తనపై ట్రోల్స్ స్టార్ట్ అయిన వెంటనే ఐశ్వర్య రాజేష్ స్పందించింది, తను అలా అనలేదంటూ కవర్ చేసే ప్రయత్నం చేసింది.
“నేను ఏ చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య ఎదుర్కోలేదు. నేను అలాంటి సమస్య ఎదుర్కోలేదు కాబట్టి, పరిశ్రమల్లో అలా జరగలేదని చెప్పాను. మిగతా వాళ్లకు కూడా జరగలేదని నేను చెప్పలేదు. మహిళల భద్రతకు కచ్చితంగా ఓ కమిటీ ఉంటాలి. ఊహించని విధంగా ఏదైనా జరిగితే తమకంటూ ఓ కమిటీ ఉందనే భరోసా మహిళా ఆర్టిస్టులకు కలగాలి. కమిటీ అలాంటివారిని రక్షించాలి, ఎవరైనా దోషులుగా తేలితే, వారిని శిక్షించాలి.”
లొకేషన్ లో మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్లకు సరైన సదుపాయాలు కూడా ఉండడం లేదంటోంది ఐశ్వర్య రాజేష్. తను హీరోయిన్ ను కాబట్టి తనకు వ్యానిటీ వాన్ ఉందని, మిగతా మహిళల సంగతేంటని ప్రశ్నిస్తోంది. కనీసం మహిళలకు బాత్రూమ్స్ అందుబాటులో ఉంచాలని ఆమె కోరుతోంది.
“కాంప్రమైజ్” అవ్వకపోతే అవకాశాలు రావనే భ్రమ నుంచి మహిళా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ బయటకు రావాలని కోరుతోంది ఐశ్వర్య. పరిశ్రమ చాలా విస్తరించిందని, ఎవరికో నో చెబితే, వాళ్లు మిగతా అవకాశాలకు గండి కొడతారనే భావన సరికాదంటోంది.