![Devara Part 1](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/09/ntrchennaidevarapm.jpg)
దేవర సినిమా విడుదల సందర్భంగా అవాంఛనీయ ఘటన జరిగింది. హైదరాబాద్ సుదర్శన్ థియేటర్ లో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ భారీ కటౌట్ కాలిపోయింది. దీంతో ఇది కాస్తా వివాదాస్పదమైంది. దేవర సినిమా నచ్చని తారక్ ఫ్యాన్స్, ఇలా కటౌట్ ను తగలబెట్టారంటూ ప్రచారం జరిగింది. ఇది కాస్తా పాదరసంలా సోషల్ మీడియాలో వ్యాపించింది.
దీంతో మిగతా హీరోల ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగారు. సినిమా నచ్చకపోతే కటౌట్ కాల్చడం అస్సలు ఏమాత్రం బాగాలేదంటూ నీతులు చెప్పడం మొదలుపెట్టారు. మరోవైపు ఎన్టీఆర్ ఫ్యాన్స్, తాము అలాంటి పనులు చేయమని సర్థించుకున్నారు.
ఎట్టకేలకు ఈ ఘటనపై థియేటర్ సిబ్బంది క్లారిటీ ఇచ్చింది. అది ఫ్యాన్స్ చేసిన పని కాదని క్లారిటీ ఇచ్చింది. దేవర షో పూర్తయిన తర్వాత సంతోషంతో ఫ్యాన్స్ టపాసులు కాల్చారు. ఆ బాణసంచాలో కొంత కటౌట్ పై పడి నిప్పంటుకుంది.
ఫలితంగా కటౌట్ పూర్తిగా కాలిబూడిదైంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఈ ఘటనకు కారణం దురభిమానం కాదని, ప్రమాదమని తెలిసొచ్చింది.