
‘దేవర’ సినిమాకు సీక్వెల్ వస్తుందా, రాదా అనే చర్చ చాన్నాళ్లుగా నడుస్తోంది. దీనికి కారణం పార్ట్-2 పై ఎవ్వరూ స్పష్టమైన ప్రకటన చేయకపోవడమే. ఎట్టకేలకు ఈ ప్రాజెక్టుపై క్లారిటీ వచ్చింది. ఒకేసారి రెండు వైపుల నుంచి స్పష్టత రావడం పెద్ద విశేషం.
‘దేవర-2’ ఉంటుందనే విషయాన్ని నిర్మాత మిక్కిలినేని సుధాకర్ ప్రకటించారు. అయితే ఈ ఏడాది మాత్రం ఉండదని క్లారిటీ ఇచ్చాడు.
తారక్ తన బాలీవుడ్ మూవీ పూర్తిచేసిన తర్వాత, ప్రశాంత్ నీల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు. నీల్ సినిమా సెట్స్ పై ఉంటుండగానే, టైమ్ చూసుకొని ‘దేవర-2’ స్టార్ట్ చేస్తాడని, అన్నీ అనుకున్నట్టు జరిగితే 2026 చివర్లో ఈ ప్రాజెక్టు ఉంటుందని ఆయన ప్రకటించాడు.
ఇదే విషయాన్ని జపాన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో భాగంగా ఎన్టీఆర్ కూడా ప్రకటించాడు.
‘దేవర-2’ కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు ఎన్టీఆర్. దేవర ఎలా చనిపోయాడు, అసలు తండ్రీకొడుకుల మధ్య బంధం ఎలా ఉండేది లాంటి విషయాలన్నింటినీ పార్ట్-2లో చూపిస్తామని కూడా ప్రకటించాడు. అలా ‘దేవర-2’ పై స్పష్టత వచ్చేసింది.