
తమ సినిమాకు బజ్ తీసుకొచ్చేందుకు మేకర్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. టికెట్ కొనుగోలుపై ఫారిన్ ట్రిప్ కు వెళ్లే అవకాశం అంటుంటారు. ఇవి కాకుండా.. బై వన్ గెట్ వన్ ఆఫర్లు కూడా పెడుతుంటారు. ఇది కూడా అలాంటిదే.
సాయిరాం శంకర్ కొత్త సినిమా పేరు ‘ఒక పథకం ప్రకారం’. ఫిబ్రవరి 7న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాకు ప్రేక్షకుల్ని ఆకర్షించేందుకు డిఫరెంట్ కాంటెస్ట్ పెట్టారు.
7వ తేదీన 50 ప్రధాన కేంద్రాల్లో ఈ సినిమా మార్నింగ్ షో చూడాలి. ఇంటర్వెల్ ఇచ్చేసరికి సినిమాలో విలన్ ఎవరో చెప్పాలి. 50 థియేటర్లలో బయట కూపన్లు, డబ్బా ఉంటాయి. కూపన్ లో విలన్ పేరు, మీ మొబైల్ నంబర్ రాసి డబ్బాలో వేయాలి.
కరెక్ట్ గా విలన్ ను గెస్ చేస్తే, 10వేల రూపాయల బహుమతి అందిస్తారు. ఇదేదో మొత్తంగా లక్కీ డ్రా తీసి ఇచ్చే బహుమతి కాదు. ప్రతి థియేటర్ కు ఒక్కర్ని ఎంపిక చేసి బహుమతి అందిస్తారు. అంటే.. 50 థియేటర్లలో 50 మంది ఈ బహుమతి గెలుచుకునే అవకాశం అన్నమాట.
వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతూ, లాంగ్ గ్యాప్ తీసుకొని, ఎట్టకేలకు ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో థియేటర్లలోకి వస్తున్న సాయిరాం శంకర్ కు, ఈ కాంటెస్ట్ ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.