
ఈమధ్యే బాలకృష్ణ 50 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నారు. ఘనంగా స్వర్ణోత్సవ సంబరాలు కూడా చేసుకున్నారు. ఇప్పుడు చిరంజీవి వంతు. తను కూడా నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారట. ఈ విషయాన్ని ఆయనే బయటపెట్టారు.
అది 1974…నర్సాపురంలోని వైఎన్ఎం కాలేజీలో చిరంజీవి చదువుకుంటున్న రోజులు. బీకామ్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. మనసులో నటించాలనే కోరిక, కానీ ఎలా అనుకుంటున్న టైమ్ లో వచ్చింది అవకాశం.
అప్పటివరకు నలుగురు స్నేహితుల మధ్య నటించడమే తప్ప, స్టేజ్ ఎక్కని చిరంజీవి.. తొలిసారి ముఖానికి రంగేసుకున్నారు. స్టేజ్ పై నటించారు. ఆయన నటించిన తొలి నాటకం ‘రాజీనామా’.
అప్పట్నుంచి చిరంజీవి నటప్రస్థానం మొదలైంది. ఈ ఏడాదితో అది 50వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఇదే విషయాన్ని గుర్తుచేసిన మెగాస్టార్, తన తొలి నాటకానికే ఉత్తమ నటుడి అవార్డ్ వచ్చిందంటూ, ఫొటో కూడా షేర్ చేశారు.