
“గజిని” సినిమా హిట్టయినప్పటి నుంచి సూర్య తెలుగులో ఒక పెద్ద చిత్రం చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. మధ్యలో రామ్ గోపాల్ వర్మ తీసిన “రక్త చరిత్ర”లో నటించినా అది సరిగా వర్కవుట్ కాలేదు. ఇన్నేళ్లకు ఒక స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్నారు సూర్య.
తమిళ, మలయాళ హీరోలతో తెలుగులో సినిమాలు తీస్తూ విజయాలు అందుకున్న వెంకీ అట్లూరి తన సక్సెస్ మంత్రం అదే అని భావిస్తున్నారు. ధనుష్ తో “సార్”, దుల్కర్ సల్మాన్ తో “లక్కీ భాస్కర్” తీసి విజయాలు అందుకున్న వెంకీ అట్లూరి ఇప్పుడు సూర్య హీరోగా సినిమా చెయ్యబోతున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.
ఇక ఈ సినిమాలో సూర్య సరసన భాగ్యశ్రీ బోర్స్ నటించబోతుంది. దాదాపుగా ఆమె పేరు ఖరారు అయింది. మొదటి చిత్రం హిట్ కాకపోయినా ఈ భామకి వరుసగా నాలుగో ఆఫర్ దక్కడం విశేషం.
రవితేజ సరసన “మిస్టర్ బచ్చన్”తో అరంగేట్రం చేసింది భాగ్యశ్రీ.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ సరసన “కింగ్ డం” అనే సినిమాలో నటిస్తోంది. అలాగే దుల్కర్ సల్మాన్ సరసన “కాంత” అనే చిత్రం చేస్తోంది. ఇప్పుడు సూర్యతో బిగ్ ఆఫర్.