
బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఇటీవల వార్తల్లో వ్యక్తిగా మారారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆమెపై చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా ఈ 50 ఏళ్ల నటి సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయారు. ఒక సహకార బ్యాంక్ లో ఆమె తీసుకున్న 18 కోట్ల రుణం మాఫీ అయ్యేలా బీజేపీ ప్రభుత్వం చేసింది కనుకే ప్రీతి బీజేపీని తెగ పొగుడుతోంది అని కేరళ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
ఆ ఆరోపణలు ఆమె గట్టిగా తిప్పి కొట్టింది. ఏకంగా కాంగ్రెస్ జాతీయ నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైనే కేసు వేస్తాను అని ఆమె పేర్కొంది. దాంతో ప్రీతి రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రచారం మొదలైంది.
ఐతే తన రాజకీయ అరంగేట్రం గురించి వస్తున్న వార్తలను ప్రీతి తోసిపుచ్చారు. రాజకీయాల్లో చేరేందుకు ఎలాంటి ఆసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం, ప్రీతి జింటా అమెరికాలో ఉంటున్నారు. ఒక అమెరికన్ వ్యాపారవేత్తని పెళ్లి చేసుకొని లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యారు.
“కొన్ని రాజకీయ పార్టీలు గతంలో రాజ్యసభ సీటు ఇస్తామని ఆఫర్ చేశాయి. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. నేను చేసే ప్రతి కామెంట్ ని, నేను పెట్టే ప్రతి పోస్ట్ ని రాజకీయాలకు ముడిపెడ్తున్నారు. కానీ నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు,” అని ప్రీతి జింటా క్లారిటీ ఇచ్చారు.