
అంతర్జాతీయ చిత్రాల్లో కూడా నటించిన బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కి అభిమానులు ఎక్కువే. ఒకప్పుడు ఆయన నటనని ఇష్టపడేవాళ్లు అభిమానులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆయన రాజకీయాలు, ఆయన రాజకీయ భావజాలం వల్ల మరింతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ముఖ్యంగా బీజేపీ సిద్ధాంతాలకు అనుకూలంగా ఉండే చిత్రాల్లో అనుపమ్ ఖేర్ కి ఎదో ఒక పాత్ర ఉంటోంది.
హిందీ చిత్రాల్లోనే కాదు తెలుగు సినిమాల్లో కూడా ‘దేశభక్తి’ లేదా ‘జాతీయవాద’ చిత్రాల్లో ఆయన తప్పనిసరిగా ఉంటున్నారు. అందుకే ఇటీవల ఆయన తెలుగు చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు.
అనుపమ్ ఖేర్ నటించిన మొదటి తెలుగు చిత్రం… “కార్తీకేయ 2.” ఆ సినిమా తెలుగులోనే కాదు హిందీలో కూడా విజయం సాధించింది. దాంతో రవితేజ హీరోగా నటించిన “టైగర్ నాగేశ్వరరావు” చిత్రంలో ఆయనకి ఒక కీలక పాత్ర ఇచ్చారు. అలాగే , పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతోన్న “హరి హర వీర మల్లు” చిత్రంలో కూడా తీసుకున్నారు. నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతోన్న “ఇండియా హౌజ్”లో కూడా అనుపమ్ కి చోటు దక్కింది.
ఇక ఇప్పుడు ఏకంగా ప్రభాస్ కొత్త చిత్రంలో ఆయనకి పెద్ద రోల్ ఇచ్చారు. ప్రభాస్ మూవీ ఆయనకి తెలుగులో ఇదో చిత్రం. నటుడిగా 544వ చిత్రం.