అనీల్ రావిపూడి కేవలం దర్శకుడు మాత్రమే కాదు. అప్పుడప్పుడు సరదాగా తెరపై కనిపిస్తుంటాడు కూడా. మరీ ముఖ్యంగా తన సినిమా ప్రమోషన్స్ కోసం అతడు కూడా హీరోహీరోయిన్లతో కలిసి నటుడిగా మారిపోతుంటాడు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రచారాన్ని పూర్తిగా తన భుజాన వేసుకున్నాడు అనీల్ రావిపూడి. వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ తో కలిసి తను కూడా ఓ నటుడిగా మారిపోయి వీడియోలు రిలీజ్ చేస్తున్నాడు.
ఈ క్రమంలో రావిపూడి కూడా వెండితెరపైకి వస్తాడని, హీరోగా సినిమా చేస్తాడనే ప్రచారం నడుస్తోంది. ఇదే విషయాన్ని రాత్రి జరిగిన ఫంక్షన్ లో యాంకరమ్మ అడిగేసింది. ‘చచ్చినా హీరోగా చేయను’ అనేది అనీల్ రావిపూడి సమాధానం.
ఈ విషయంలో అతడు చాలా క్లియర్ గా ఉన్నాడని ఆ స్టేట్ మెంట్ తోనే అర్థమౌతుంది. అయితే హీరోగా చేయకపోయినా నటుడిగా అతడు తెరపైకొస్తాడని పక్కనే ఉన్న దిల్ రాజు ప్రకటించాడు. దీనికి అనీల్ రావిపూడి కూడా తలూపాడు. చూస్తుంటే.. దిల్ రాజు బ్యానర్ లోనే ఓ సినిమాలో కీలక పాత్రలో అనీల్ రావిపూడి కనిపించేలా ఉన్నాడు.