![Nayanthara](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/11/nayantharaf-genra.jpg)
“నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్” అనే డాక్యుమెంటరీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. అదిలా స్ట్రీమింగ్ కు వచ్చిన వెంటనే, హీరో ధనుష్ లీగల్ నోటీసు పంపించాడు.
తన అనుమతి లేకుండా, తను నిర్మించిన సినిమాకు సంబంధించిన క్లిప్పింగ్స్ ఉపయోగించారని, పరిహారంగా తనకు 10 కోట్లు చెల్లించాలంటూ డిమాండ్ చేశాడు. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిథిలో ఉంది. ఇప్పుడు మరో నిర్మాత తనకు 5 కోట్లు కావాలంటున్నాడు.
“నయనతార-బియాండ్ ది ఫెయిరీ టేల్” ఇప్పుడు మరో సమస్యలో పడినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ సినిమాలో ‘చంద్రముఖి’ సినిమా విజువల్స్ వాడారు. తమిళ చిత్రం చంద్రముఖి నిర్మాతలు తమ సినిమాలోని క్లిప్‌లను ఇందులో అనధికారికంగా వాడారని ఆరోపిస్తూ డాక్యుమెంటరీ నిర్మాతలపై దావా వేశారని… కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించారంటూ లీగల్ నోటీసులిచ్చినట్టు వార్తలొస్తున్నాయి.
అయితే వీటిలో నిజం లేదు. స్వయంగా ‘చంద్రముఖి’ నిర్మాతలు ఈ పుకార్లపై స్పందించారు. తాము నయనతారకు ఎలాంటి లీగలు నోటీసులు స్పందించలేదని, పైపెచ్చు క్లిప్స్ వాడుకోమని అనుమతి కూడా ఇచ్చామని స్పష్టం చేశారు. దీంతో నయనతార ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.