వివాదాల కోసం మాట్లాడతాడా.. మాట్లాడిన తర్వాత వివాదాస్పదమౌతుందో తెలీదు కానీ.. ప్రతిసారి ఏదో ఒకటి కెలికే ప్రయత్నం చేస్తుంటాడు లిరిసిస్ట్ అనంత శ్రీరామ్. ఈసారి కూడా అతడు అదే పని చేశాడు. కల్కి సినిమాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దానికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చాడు దర్శకుడు నాగ్ అశ్విన్.
ఇంతకీ ఏం జరిగిందంటే…
ఓ హైందవ సభలో ప్రసంగించాడు అనంత్ శ్రీరామ్. సిరివెన్నెల సీతారామశాస్త్రి హైందత్వాన్ని తన సాహిత్యంలో చూపించారని, కానీ తను ఆ పని చేసినప్పుడు అన్యమతానికి చెందిన ఓ సంగీత దర్శకుడు తీవ్ర అభ్యంతరం చెప్పాడని, అప్పట్నుంచి ఇప్పటివరకు 15 ఏళ్ల పాటు అతడి సంగీతానికి సాహిత్యం ఇవ్వడం మానేశానని ప్రకటించుకున్నాడు.
ఇంతవరకు బాగానే ఉంది కానీ, ఆ తర్వాతే అసలు వివాదం మొదలైంది. ‘కల్కి’ సినిమాలో కర్ణుడ్ని హీరోగా చూపించడాన్ని వ్యతిరేకంచాడు అనంత్ శ్రీరామ్. పురాణాల్ని వక్రీకరిస్తున్నారని, సినిమాలో కర్ణుడి పాత్రను హైలెట్ చేశారని, కర్ణుడ్ని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించాడు.
భారతంలో కర్ణుడు అసలు వీరుడే కాదని, అలాంటి వ్యక్తిని హీరోగా చూపించారనేది అనంత శ్రీరామ్ ఆరోపణ. దీనిపై నాగ్ అశ్విన్ పరోక్షంగా కౌంటర్ వేశాడు. అనువదించిన మహాభారతం పుస్తకాల్ని అమెజాన్ లో జపాన్ వాసులు ఎక్కువగా చదువుతున్నారని అన్నాడు. ప్రపంచం మొత్తానికి మహాభారతం గురించి తెలుసని పరోక్షంగా కౌంటర్ వేసినట్టయింది.
మరో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఈ వివాదంపై స్పందించాడు. అనంత్ శ్రీరామ్ కేవలం కర్ణుడి పాత్ర గురించే అన్నారా లేక దానవీరశూరకర్ణ సినిమాలో కర్ణుడి ఔన్నత్యాన్ని అద్భుతంగా చూపించిన ఎన్టీఆర్ ను కూడా అన్నట్టా అని ప్రశ్నించారు.