
“సంక్రాంతికి వస్తున్నాం” వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి తీయబోతున్న సినిమా ఎలా ఉండబోతుంది? “నా స్టైల్ లో మార్పు ఉండదు. నాకు తెలిసిన పద్దతిలోనే కొంత వైవిధ్యం చూపిస్తాను. పూర్తిగా కొత్తగా తీయను,” ఇటీవల కుండబద్దలు కొట్టినట్లు తెలిపాడు రావిపూడి.
ఆయన బలం… కామెడీ. ఎంటర్ టైనింగ్ గా సినిమాలు తీయడం ఆయన పద్దతి. ఆ స్టయిల్ ని వదులుకోను అని చెప్పాడు అనిల్ రావిపూడి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తీసే సినిమా కూడా కామెడీ ప్రధానంగానే సాగుతుందట. ఇప్పటికే స్క్రిప్ట్ ని దాదాపు పూర్తి చేశారట. ఏప్రిల్ చివర్లో కానీ మేలో కానీ ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా షురూ అవుతుంది. ఆరు నెలల్లో షూటింగ్ మొత్తం పూర్తి చేసి మళ్ళీ సంక్రాంతి పండగకి విడుదల చేస్తాడట.
మెగాస్టార్ చిరంజీవి కామెడీ బాగా పండిస్తారు. ఆయన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లు కామెడీ సీన్లు రాస్తున్నడట.

ఐతే, ఈ సినిమాలో కూడా చిన్న సందేశం, కొంత ఫ్యామిలీ ఓరియెంటెడ్ హ్యూమర్ మిక్స్ చేస్తాడట. చిరంజీవికి ఇద్దరు హీరోయిన్లను పెట్టడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి ఇప్పటికే తన డేట్స్ ఇచ్చేశారు.