కన్నడ నటుడు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, అతడి టీమ్ కు వ్యతిరేకంగా పోలీసులు 200 సాక్ష్యాధారాలు సేకరించారు. వీటన్నింటినీ పొందుపరుస్తూ 3991 పేజీల ఛార్జ షీట్ ను దాఖలు చేశారు. 8 వాల్యూమ్స్ తో ఉన్న ఈ ఛార్జ్ షీట్ ను బెంగళూరులోని 24వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు సమర్పించారు.
ఈ ఛార్జ్ షీట్ లో దర్శన్-పవిత్రకు వ్యతిరేకంగా అత్యంత బలమైన సాక్ష్యాధారాల్ని పోలీసులు సమర్పించినట్టు తెలుస్తోంది. వీటిలో ముఖ్యమైనది దర్శన్-పవిత్ర దుస్తులపై ఉన్న మృతుడు రేణుకాస్వామి రక్తపు మరకలు.
వీటికి క్రైమ్ సీన్ లో తీసిన ఫొటోను జతచేశారు. క్రైమ్ సీన్ లో రేణుకా స్వామి బతిమలాడుతున్న ఫొటోను పోలీసులు సంపాదించారు. వీటితో పాటు పలు డీఎన్ఏ ఆధారాలు, 8 మంది ప్రభుత్వ అధికారులు ఇచ్చిన రిపోర్టులు, ముగ్గురు ప్రత్యక్ష సాక్ష్యుల వాంగ్మూలాల్ని జతచేశారు. దీంతో దర్శన్-పవిత్ర ఈ కేసులో పూర్తిగా కూరుకుపోయినట్టయింది.
దర్శన్ గర్ల్ ఫ్రెండ్ పవిత్రకు రేణుకాస్వామి అభ్యంతరకర సందేశాలు పంపించాడు. దీంతో దర్శన్ కు కోపమొచ్చి రేణుకా స్వామి అంతుచూడాల్సిందిగా కొందర్ని పురమాయించాడు. వాళ్లంతా రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టి చంపారని, ఆ టైమ్ లో దర్శన్-పవిత్ర కూడా అక్కడే ఉన్నారని పోలీసులు వాదిస్తున్నారు.