
రాజేంద్రప్రసాద్ ఒకప్పుడు స్టార్. హీరోగా అనేక హిట్స్ అందించారు. ఇప్పుడు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. నితిన్ హీరోగా రూపొందిన “రాబిన్ హుడ్” రాజేంద్రప్రసాద్ నటించారు. ఈ నెల 28న విడుదల కానున్న ఈ సినిమా గురించి ఆయన చెప్తున్న విశేషాలు.
రాబిన్హుడ్ గురించి చెప్పండి?
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడు, ఓ బేబీ, ఎఫ్2 చిత్రాల్లో నేను చేసిన పాత్రలు ఎలా హైలెట్ అయ్యాయో ఇందులో కూడా అంతే స్థాయిలో నా పాత్ర ఉంటుంది. దర్శకుడు వెంకీ కుడుముల త్రివిక్రమ్ వద్ద చేశారు. ఆయన శైలిలోనే అద్భుతంగా రాశాడు, తీశాడు. ఈ పాత్ర చేస్తుంటే నేను హీరోగా నటించిన పాత రోజులు మళ్ళీ గుర్తుకు వచ్చాయి.
ఈ సినిమాలో నేను ఒక సెక్యూరిటీ ఏజెన్సీకి ఓనర్ ని. నా ఏజెన్సీలో పని చేయడానికి హీరో నితిన్ వస్తాడు. ఫారిన్ నుంచి వచ్చిన హీరోయిన్ శ్రీలలకు సెక్యురిటీ ఇచ్చే బాధ్యత మా ఇద్దరిపై ఉంటుంది. అలా మొదలవుతుంది వినోదం. కథ ప్రకారం నితిన్ టైమింగ్ ని నేను ఫాలో అవ్వాలి, నా టైమింగ్ ని నితిన్ ఫాలో అవ్వాలి. మా ఇద్దరికీ ఒక ట్రబుల్ పర్సన్… వెన్నెల కిశోర్. మొత్తం నవ్వులే. ఈ సినిమాతో నితిన్ స్టేచర్ మారబోతోంది.
నటుడిగా జీవితం సంతృప్తినిచ్చిందా?
నటుడు కావడమే అదృష్టం. ఈ జీవితం దేవుడు, ప్రేక్షకులు ఇచ్చినది. లేడిస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, మిస్టర్ పెళ్ళాం,పెళ్లి పుస్తకం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా ప్రతి సినిమా నన్ను జనాలకు దగ్గరికి చేసింది. ఒకే ఏడాది హీరోగా 12 సినిమాలు రిలీజ్ చేసిన రోజులున్నాయి. సాధారణ వ్యక్తి పాత్రలే చేశాను. అందరూ రిలేట్ చేసుకునే పాత్రలే. అందుకే అందరికీ దగ్గరయ్యానని అనుకుంటాను.
నాటి ప్రధాని పీవీ నరసింహారావు గారు దగ్గర నుంచి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు జీవితంలో ఒత్తిడి, నిరాశలో ఉన్నప్పుడు సరదాగా నవ్వుకోవడానికి, మనసు తేలిక అవడానికి నా సినిమాలు చూస్తుంటామని చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటికీ దర్శకులు నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం నా అదృష్టం.
కొత్త దర్శకులకు మీతో వర్క్ చేయడం ఎలా వుంటుంది?
నాకు కొత్త పాత అని తేడా ఉండదు. నాతో వర్క్ చేయడం చాలా ఈజీ. కొత్త దర్శకులు నాతో పని చెయ్యడం ఉత్సాహంగా ఫీల్ అవుతారు. సెట్ కి ముందే వచ్చేస్తా. అల్లరి చేస్తా.
కొత్తగా చేస్తున్న సినిమాలు?
దాదాపు ఏడు సినిమాలు షూటింగ్ లో ఉన్నాయి. మరో ఐదు మొదలు కావాల్సి ఉంది.