
కొంత గ్యాప్ తర్వాత నారా రోహిత్ మళ్ళీ నటుడిగా మన ముందుకు వస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన “భైరవం” చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించారు. ఇది ఒక తమిళ చిత్రానికి రీమేక్. ఈ సినిమాలో తన పాత్ర, ఈ సినిమా తమిళంలో కన్నా బావుంటుంది అని అంటున్నారు నారా రోహిత్.
ఇది రీమేక్ లా అనిపించదు, పక్కా తెలుగు చిత్రంలా అనిపిస్తుంది అనేది రోహిత్ భావన.
“తమిళ గరుడన్ సినిమా చూశాను. అందులో శశి కుమార్ చేసిన క్యారెక్టర్ నేను చేశాను ఇక్కడ. తమిళ్లో దీన్ని ఒక రస్టిక్ విలేజ్ డ్రామా లా చేశారు. తెలుగు నేటివిటికి తగ్గట్టు చేంజెస్ చేయడం జరిగింది. గరుడన్ చూసిన తర్వాత కూడా ఈ సినిమా చూస్తే ఒక ఒరిజినల్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది,” అని క్లారిటీ ఇచ్చారు.
“మనోజ్ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. ఈ సినిమాతో చాలా పర్సనల్ బాండ్ వచ్చింది. సాయి నాకు 2010 నుంచి తెలుసు. ఈ సినిమాతో మేమంతా మరింత దగ్గరయ్యాం. ఇంతకుముందు నేను యాక్షన్ సినిమాలు చేశాను కానీ ఇంత కమర్షియల్ మాస్ ఫిలిం నేనెప్పుడూ చేయలేదు. ఇది నాకు ఒక కొత్త అనుభవం,” అని అన్నారు నారా రోహిత్.
అన్ని రకాల సినిమాలు చూస్తారట రోహిత్. కానీ, ఒక జానర్ సినిమా మాత్రం చూడడు, చెయ్యడు. “నాకు హారర్ తప్ప అన్ని సినిమాలు ఇష్టం. డబ్బులు ఇచ్చి ఎందుకు భయపడాలి? అందుకే హారర్ సినిమాలు తప్ప అన్నీ సినిమాలు చేస్తా. ఇక నేను చేసిన సినిమాల్లో నాకు ఇష్టమైనవి ఏవంటే… సోలో, రౌడీ ఫెలో, బాణం, జోఅచ్చుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు.”
ఇక సినిమాలు ఎక్కువగా చేస్తారా? “అవును. ఇక గ్యాప్ రానివ్వను. మా కజిన్స్ తో కలిసి ‘సుందరకాండ’ సినిమా నిర్మిస్తున్నా. మంచి కథలు వస్తే తప్పకుండా సినిమాలు నిర్మిస్తాను.”
‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాకి సీక్వెల్ చేసే ఆలోచన ఉందా? “ఇంతకుముందు ఆ ఆలోచన ఉండేది దాని మీద వర్క్ కూడా జరిగింది కానీ అది మెటీరియలైజ్ అవ్వలేదు. భవిష్యత్తులో అది అవుతుందేమో చూడాలి, ఇప్పుడైతే అలాంటి ప్లాన్స్ లేవు,” అన్నారు నారా రోహిత్.