
మంచు విష్ణు చెప్పే మాటలు, ఆయన చేష్టలు విచిత్రంగా ఉంటాయి. తాజాగా జరిగిన ఒక సంఘటన ఆయన విచిత్ర వైఖరికి నిదర్శనంగా నిలుస్తోంది. మీడియా సమాచారం ప్రకారం… మంచు విష్ణు టీం తమ సినిమాకి సంబందించిన “గ్రాఫిక్స్ వర్క్”తో కూడిన హార్డ్ డిస్క్ ని ఆఫీస్ లో పనిచేసే వ్యక్తి తీసుకొని పారిపోయాడట.
సినిమాలో కీలకమైన కొన్ని సన్నివేశాలకు విజువల్ ఎఫెక్ట్స్ చెయ్యమని ఒక కంపెనీకి అప్పచెప్పితే ఆ కంపెనీ పని పూర్తి అయ్యాక ముంబై నుంచి విష్ణు ఆఫీస్ కి హార్డ్ డిస్క్ పంపించిందంట. ఎలా పంపించిందో తెలుసా? డీటీడీసి కొరియర్ లో ఆ హార్డ్ డిస్క్ ని పంపింది అని చెప్తున్నారు. ఆఫీస్ లో ఉన్న వ్యక్తి ఆ కొరియర్ రాగానే దాన్ని తీసుకొని ఉడాయించారట. దాంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని తెలుగు టీవీ ఛానెల్స్ ప్రసారం చేశాయి.
లక్షలు, కోట్ల రూపాయల వర్క్ చేసే గ్రాఫిక్స్ కంపెనీలు అయిదు వందలో, వెయ్యి రూపాయలు పెట్టి డీటీడీసి కొరియర్ లో పంపించేసి చేతులు దులుపుకుంటాయా. అది ఏమైనా అమెజాన్ లో కొన్న వస్తువా? నిజంగా డీటీడీసి కొరియర్ లోనే పంపించే అంత చౌకబారు కంపెనీకి విజువల్ ఎఫెక్ట్స్ చేసే పని అప్పగించినందుకు విష్ణుని నిందించాలి.
రెండోది, కొరియర్ లో పంపించిన హార్డ్ డిస్క్ నిజంగానే ఎవరో ఎత్తుకపోతే మరో హార్డ్ డిస్క్ ఆ కంపెనీ పంపలేదా? విష్ణు టీం నిజంగా ఇలా జరిగింది అని చెప్పింది అనుకోండి, మీడియాకైనా బుర్ర ఉండాలి కదా ఈ వార్త వేసేందుకు. ఏ కంపెనీ అయినా డీటీడీసి కొరియర్ లో హార్డ్ డిస్క్ ని పంపిస్తుందా అనే ప్రశ్న మీడియాకి రావాలి కదా.
ఇదంతా రాబోయే “కన్నప్ప” అనే సినిమా గురించి. మంచు విష్ణు హీరోగా నటించి, నిర్మిస్తున్న సినిమా ఇది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి పేరొందిన నటులు ఈ సినిమాలో అతిథి పాత్రల్లో నటించారు. అంత పెద్ద స్టార్స్ నటించినా విష్ణు కొరియర్లో గ్రాఫిక్స్ పంపే కంపెనీకి పనులు అప్పచెప్పాడు అనుకోవాలా?