
‘మ్యాడ్’కి సీక్వెల్ గా రూపొందిన ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చి 28న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోలుగా నటించిన నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ లతో ముచ్చట్లు
ఈ సినిమాలో మీ ముగ్గురిలో హీరో ఎవరు?
వినోదమే ఈ సినిమాకి మెయిన్ హీరో. ఆ వినోదమే మ్యాడ్ స్క్వేర్ ని నడిపిస్తుంది. మొదటి చిత్రం ‘మ్యాడ్’తో పోలిస్తే ‘మ్యాడ్ స్క్వేర్’లో కామెడీ ఎక్కువ ఉంటుంది. ఈసారి అశోక్(నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్) పాత్రలు కూడా ఎక్కువ వినోదాన్ని పంచుతాయి.
సీక్వెల్ కోసం కొత్తగా ఏమి చేశా?
రామ్ నితిన్: మ్యాడ్ నా మొదటి సినిమా. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే భయం కాస్త ఉండేది. మ్యాడ్ స్క్వేర్ కి ఎలాంటి భయం లేదు. చాలా కాన్ఫిడెంట్ గా చేశాము. దాంతో పర్ఫామెన్స్ ఇంకా బెటర్ గా వచ్చింది.
నార్నె నితిన్: మ్యాడ్ లో ప్రతి పాత్రకు ఒక ట్రాక్ ఉంటుంది. నా పాత్ర మొదట కాస్త సీరియస్ గా ఉంటుంది. చివరికి వచ్చేసరికి మిగతా పాత్రల్లాగా కామెడీ చేస్తుంటాను. ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ లో పూర్తి కామెడీ పాత్రలో కనిపిస్తాను. అందుకు తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నాను.
సంగీత్ శోభన్: మ్యాడ్ విజయం ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మ్యాడ్ స్క్వేర్ ను ఆడుతూపాడుతూ చేశాము. ఇంకా ఎక్కువ నవ్వించాలనే ఆలోచన తప్ప, ప్రత్యేక కసరత్తులు చేయలేదు.
ఈ సినిమాలో కథ లేదు అంటున్నారు కదా?
నార్నె నితిన్: బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాల నుంచి కథ ఆశించాలి. ఇది నవ్వించడమే లక్ష్యంగా తీసిన సినిమా. అందుకే పెద్ద కథ ఉంటుందని ఆశించకండి.
సంగీత్ శోభన్: ఒక సినిమా మనం ఏ ఉద్దేశంతో చేశామనేది ముందే ప్రేక్షకులకు తెలిసేలా చేస్తే మంచిది. ఇది నవ్వించడానికి తీసిన సినిమా కాబట్టి, ఆ అంచనాలతో ప్రేక్షకులు థియేటర్లకు రావాలి.
ఇందులో హీరోయిన్లు లేరా?
మొదటి భాగానికి కొనసాగింపుగా వారి పాత్రలు మా జీవితాల్లో ఉంటాయి. కానీ, వారు తెర మీద కనిపించరు.
కుటుంబ ప్రేక్షకులు చూసేలా సినిమా ఉంటుందా?
సంగీత్ శోభన్: మొదటి పార్ట్ సమయంలో కూడా ఇలాంటి అనుమానాలే వ్యక్తమయ్యాయి. కానీ, సినిమా విడుదలైన తర్వాత కుటుంబ ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. మ్యాడ్ స్క్వేర్ ను కూడా క్లీన్ కామెడీ ఫిల్మ్ గానే రూపొందించాము. మ్యాడ్ విజయానికి కారణం వినోదం. అదే మా బలం. దానిని దృష్టిలో పెట్టుకొని పూర్తి వినోద భరిత చిత్రంగా మ్యాడ్ స్క్వేర్ ను మలచడం జరిగింది. అలాగే ఈ సినిమాలో కామెడీ పూర్తిగా కొత్తగా ఉంటుంది.
జూనియర్ ఎన్టీఆర్ ఏమైనా సలహాలు ఇస్తారా?
నార్నె నితిన్: నా మొదటి సినిమా నుంచి మా బావ (ఎన్టీఆర్) సలహాలు ఇస్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే నన్ను నేను మలుచుకుంటున్నాను.