గోపీచంద్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘విశ్వం’. ఈ కలయికలో తొలి సినిమా ఇదే.
దసరా కానుకగా అక్టోబర్ 11న సినిమా థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా హీరో గోపీచంద్, మీడియాతో మాట్లాడాడు. ‘విశ్వం’ విశేషాల్ని పంచుకున్నాడు.
శ్రీనువైట్ల ఈ కథ చెప్పినప్పుడు మొదటిసారి కలిగిన ఫీలింగ్ ఏంటి?
శ్రీనువైట్లతో సినిమా చేయాలని చాన్నాళ్లుగా అనుకుంటున్నాను. గతంలో ఓ రెండు లైన్స్ చెప్పారు. అవి బావున్నాయి కానీ నాకు సరిపోవనిపించింది. అదే మాట చెప్పాను. తర్వాత ‘విశ్వం’ స్టోరీలైన్ చెప్పారు. పాయింట్ నచ్చింది. తన స్టయిల్ కి తగ్గట్టు కథ చేయడానికి 7 నెలలు సమయం తీసుకున్నారు శ్రీనువైట్ల. ఇందులో కంప్లీట్ గా శ్రీనువైట్ల మార్క్ యాక్షన్, కామెడీ అన్నీ ఉన్నాయి.
‘విశ్వం’లో కామెడీ ఎలా వచ్చింది?
లౌక్యం తర్వాత అంత మంచి ఎంటర్టైన్మెంట్ ‘విశ్వం’లో కుదిరింది. షూటింగ్ చేసేటప్పుడు నేనే కొన్ని సీన్స్ కి నవ్వు ఆపుకోలేకపోయేవాడిని. చాలామంది ఆర్టిస్టులకి సారీ కూడా చెప్పాను. సీన్స్ అంత హిలేరియస్ గా వచ్చాయి.
ట్రైన్ ఎపిసోడ్ హైలెట్ అని విన్నాం?
శ్రీను వైట్ల వెంకీ సినిమాలో పాపులర్ ట్రైన్ ఎపిసోడ్ ఉంది కాబట్టి కచ్చితంగా ఆయన నుంచి మరో ట్రైన్ ఎపిసోడ్ వస్తుందంటే పోలిక పెట్టడం సహజం. అయితే అది వేరే జోనర్, ఇది పూర్తిగా మరో జానర్. కాకపోతే అందరి అంచనాలకు ‘విశ్వం’ట్రైన్ సీక్వెన్స్ రీచ్ అవుతుంది. సినిమాలో వినోదం చాలా అద్భుతంగా పండింది. వెన్నెల కిషోర్, వి.టి. గణేష్, నరేష్, ప్రగతి.. ఇలా అందరూ చాలా బాగా చేశారు. ట్రైన్ సీక్వెన్స్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు చిన్న టెన్షన్ కూడా రన్ అవుతుంది. అది చాలా బాగుంటుంది.
శ్రీనువైట్లతో వర్కింగ్ ఎలా ఉంది?
శ్రీను వైట్ల లో సహజంగానే గానే ఒక సెటైరికల్ కామెడీ ఉంటుంది. ఆయనది చాలా ప్రత్యేకమైన టైమింగ్. ఆయన చేసినట్లు కాపీ కొట్టేశాను. డబ్బింగ్ కూడా ఆయనకి ఎలా కావాలో ఆయన్ని చూసి కాపీ కొట్టి చెప్పేశాను. ఇందులో నా క్యారెక్టర్ పేరు విశ్వం. అయితే రెండు అక్షరాలు ఉన్న టైటిల్ నా సెంటిమెంట్ అనుకుంటారేమో అని శ్రీను వైట్లకి చెప్పాను. అయితే ఈ సినిమాకి ‘విశ్వం’ టైటిల్ సరిగ్గా సరిపోతుందన్నారాయన. ‘విశ్వం’ పండగ సినిమా. కుటుంబమంతా కలసి హాయిగా నవ్వుకోవచ్చు.
ప్రభాస్, మీ కాంబినేషన్ లో సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు?
మాకు చేయాలనే ఉంది. కానీ అన్నీ సెట్ కావాలి. కుదిరినప్పుడు తప్పకుండా చేస్తాం.
యువీ క్రియేషన్స్ లో సినిమా చేస్తున్నారా?
కథాచర్చలు సాగుతున్నాయి. త్వరలోనే వెల్లడిస్తాను.