అంజలి నటనకు వంకపెట్టలేం. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయే నటి. హారర్ కామెడీ జానర్ లో కూడా నటించి మెప్పించింది. ఆ మాటకొస్తే ఆమె 2014లో నటించిన “గీతాంజలి” సినిమా హారర్ కామెడీ చిత్రాలకు ఒక క్రేజ్ తెచ్చింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా “గీతాంజలి మళ్లీ వచ్చింది” రూపొందింది.
ఈ సినిమా ఈ నెల 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా అంజలితో ముచ్చట్లు…
G చిత్రాల ట్రెండ్
“కాకతాళీయమే కానీ గమ్మత్తుగా నేను నటిస్తున్న మూడు చిత్రాలకు “G” అనే అక్షరంతో కూడిన టైటిల్స్ సెట్ అయ్యాయి. రామ్ చరణ్ హీరోగా శంకర్ మొదలుపెట్టిన ‘గేమ్ ఛేంజర్’ అన్నింటి కన్నా ముందు స్టార్ట్ అయింది. దాదాపు మూడేళ్ల క్రితం మొదలైంది అది. కానీ షూటింగ్ ఆలస్యమైంది. ఆ తర్వాత ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మొదలైంది. కానీ ముందుగా విడుదల అవుతుంది ‘గీతాంజలి 2’. “
పాత పాత్రలు… కొత్త క్యారెక్టర్లు
“ఇది సీక్వెల్. కాబట్టి పాత క్యారెక్టర్స్ ను మార్చలేం. ఐతే ఈ కథలోకి కొత్త క్యారెక్టర్స్ కూడా వచ్చాయి. మొదటి భాగం చూడని వాళ్ళు కూడా సులువుగా అర్థం చేసుకునేలా కోన గారు సెట్ చేశారు. కొత్త దర్శకుడు శివ తుర్లపాటి కూడా బాగా తీశారు. ఈ సినిమా క్లైమాక్స్ లో యాక్షన్ కూడా చేశాను. ఐతే, సినిమా ఆద్యంతం నవ్వులే ఉంటాయి. మంచి వినోదాత్మక చిత్రం. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేశారు. సాంకేతికంగా బాగుంటుంది.
నా కెరీర్ లో ఎన్నో మంచి సినిమాలు, పాత్రలు దక్కాయి. ఇది 50వ చిత్రం కావడం హ్యాపీగా ఉంది.
50 నాటౌట్
50 చిత్రాలు చేస్తాను అనుకోలేదు. కానీ ఇప్పుడు ఇంకో 50 చేస్తాను అన్న నమ్మకం ఉంది.
అన్నీ వైవిధ్యమే
రొటీన్ పాత్రలు చెయ్యడం నాకు ఇష్టం ఉండదు. ‘G’ అక్షరం మూడు చిత్రాల్లో కామన్ కానీ నా పాత్రలు, ఆయా సినిమా కథలు వైవిధ్యం. ఒకదానికి ఒకటి సంబంధం లేనివి.