
బాలీవుడ్ హీరోయిన్లకు ఎర్ర తివాచీ వేస్తారు టాలీవుడ్ మేకర్స్. ఈ అలవాటు ఎప్పటి నుంచో ఉంది. ఐతే, ఇప్పుడు సౌత్ సినిమాలకే హిందీ మార్కెట్ లో క్రేజ్ ఉంది. అందుకే, దక్షిణాది భామలను ఎక్కువగా తీసుకుంటున్నారు బాలీవుడ్ మేకర్స్.
ఇటీవలే కీర్తిసురేష్ “బేబీ జాన్”లో నటించింది. ఇటీవలే విడుదలై పరాజయం పాలు అయింది. ఐనా మరికొందరు భామలకు ఎంట్రీ ఉంది ఈ ఏడాది.
శ్రీలీల ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడం ఖాయం. సైఫ్ అలీఖాన్ తనయుడు ఇబ్రహీం అలీఖాన్ హీరోగా రాబోతున్న సినిమాలో కూడా శ్రీలీలను తీసుకున్నారు. త్వరలోనే ప్రకటన రానుంది. ఇప్పటికే ఆమె ఇబ్రహీంతో ఫోటోషూట్ కూడా పూర్తి చేసింది. “పుష్ప 2″లో ఆమె “కిస్సిక్” అనే ఐటెం సాంగ్ చేసింది. ఆ సినిమా హిందీలో ఆల్ టైం బిగ్గెస్ట్ గా నిలిచింది. దాంతో ఈ భామని హిందీలో పరిచయం చేసేందుకు బాలీవుడ్ మేకర్స్ పోటీపడుతున్నారు.
ఇక సాయిపల్లవి కూడా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటించింది. అదింకా రిలీజ్ కాలేదు. ఇక అన్నింటికన్నా భారీ చిత్రం …”రామాయణం”లో కూడా ఆమెకి అవకాశం వచ్చింది. రణబీర్ కపూర్ సరసన నటిస్తోంది ఇందులో. రణబీర్ రాముడు, ఆమె సీత.

ఇప్పటికే రష్మిక మందాన బాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా స్థిరపడింది. “యానిమల్”, “పుష్ప 2′ సినిమాల తర్వాత ఆమె రేంజ్ మారిపోయింది. బాలీవుడ్ లో ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన “సికిందర్” అనే సినిమా చేస్తోంది. అలాగే విక్కి కౌశల్ సరసన “చావా” అనే సినిమా పూర్తి చేసింది.