ఆగస్టు 15… ఆ డేట్ ని టార్గెట్ చేస్తూ అనేక సినిమాలు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో మూడు చిత్రాలు, కోలీవుడ్ లో మూడు చిత్రాలు, బాలీవుడ్ లో మూడు చిత్రాలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమాల్లో నటిస్తున్న పలువురు హీరోయిన్లకు ఈ వారం పెద్ద పరీక్ష.
కావ్య థాపర్ (Kavya Thapar)
తెలుగులో “డబుల్ ఇస్మార్ట్”, “మిస్టర్ బచ్చన్”, “ఆయ్” సినిమాలు విడుదల అవుతున్నాయి. “డబుల్ ఇస్మార్ట్”లో రామ్ సరసన కావ్య థాపర్ నటించింది. ఈ భామ ఇప్పటివరకు పలు సినిమాల్లో నటించినా సరైన హిట్ దక్కలేదు. ఈ సినిమా ఆమెకి చాలా ఇంపార్టెంట్. సో ఆగస్టు 15 ఆమెకి పరీక్ష
భాగ్యశ్రీ బోర్సె (Bhagyashri Borse)
భాగ్యశ్రీ బోర్సె ఇప్పటికే అందరి దృష్టిలో పడింది. ఆమె హీరోయిన్ గా నటించిన మొదటి చిత్రం… మిస్టర్ బచ్చన్. రవితేజ సరసన నటించింది ఇందులో. మొదటి సినిమాకే ఆమెకి చాలా క్రేజ్ వచ్చింది. ఇది హిట్ ఐతే ఆమె మరో శ్రీలీల కావొచ్చు. ఇప్పటికే రెండు సినిమాలు సైన్ చేసింది మరి.
తమిళంలో ఈ వారం “రఘు తాత”, “తంగళన్”, “డిమంటే కాలనీ 2” వంటివి ప్రధానంగా పోటీపడుతున్నాయి.
కీర్తి సురేష్ (Keerthy Suresh)
కీర్తి సురేష్ ఇప్పటికే అగ్ర హీరోయిన్ గా స్థిరపడింది. ఐతే ఆమెకి ఇప్పుడు పెద్ద హీరోల సరసన సినిమాలు రావడం లేదు. దాంతో ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది. అలా చేసిన తమిళ చిత్రం… “రఘు తాత”. ఒకవైపు విక్రమ్ వంటి పెద్ద హీరో నటించిన “తంగళన్” పోటీలో ఉంది. ఆ సినిమాతో పోటీ పడి కీర్తి సురేష్ తన సినిమాకి ఓపెనింగ్స్ రాబట్టగలదా అనేదే ప్రశ్న. అదే ఆమెకి పెద్ద పరీక్ష.
మాళవిక మోహనన్ (Malavika Mohanan)
విక్రమ్ హీరోగా దర్శకుడు పా రంజిత్ తీసిన “తంగలన్” ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐతే ఈ సినిమాలో మాళవిక మోహనన్ ఒక వెరైటీ పాత్ర పోషించింది. ఆమె హీరోయినే కానీ విక్రమ్ సరసన కాదు. ఆమెకి తమిళంలో ఇది పెద్ద సినిమా. తెలుగులో ప్రభాస్ సరసన “ది రాజా సాబ్” సినిమాలో నటిస్తోంది. కానీ తమిళంలో ఆమెకి ఇది పరీక్ష.
ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar)
ప్రియా భవానీ శంకర్ ఇటీవల కమల్ హాసన్ మూవీ “భారతీయుడు 2″లో నటించింది. అంత పెద్ద సినిమాలో నటించినా ఆమెకి కలిగిన లాభం శూన్యం. ఇప్పుడు హిట్ కొట్టాల్సిన పరిస్థితి. సో ఈ అమ్మడు “డిమాంట్ కాలనీ 2″పై ఆశలు పెట్టుకొంది. మొదటి భాగం పెద్ద హిట్. మరి రెండో భాగం కూడా హిట్ అవుతుందా?
బాలీవుడ్ లో ఈ వారం “స్త్రీ 2”, “ఖేల్ ఖేల్ మే”, “వేదా” చిత్రాలు పోటీపడుతున్నాయి.
శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor)
“స్త్రీ” సినిమా చాలా పెద్ద హిట్. చాలా గ్యాప్ తర్వాత దానికి సీక్వెల్ రూపొందింది.. దానికి తగ్గట్లే “స్త్రీ 2” సినిమాకి చాలా క్రేజ్ వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ బాగున్నాయి. ఐతే, “స్త్రీ 2″… మొదటి భాగం కన్నా హిట్ అయితేనే హీరోయిన్ శ్రద్ధా కపూర్ కి పెద్ద హీరోయిన్ గా ఉన్న పేరు నిలబెడుతుంది. ఈ సినిమాని హిట్ చెయ్యడం ఆమెకి పెద్ద సవాల్.
తమన్నా (Tamannaah Bhatia)
ఇక మన తెలుగు భామ తమన్నా హిందీలో నటించిన మరో చిత్రం… వేదా. ఈ సినిమాలో ఆమె జాన్ అబ్రహం సరసన నటించింది. ఆమె జాన్ కి కూడా జోడిగా మెప్పిస్తుందా? బాలీవుడ్ లో తమన్నాకి విజయాల శాతం తక్కువ. మరి ఈ సినిమాతో స్కోర్ పెంచుకుంటుందా?
ప్రగ్య జైస్వాల్, తాప్సి, వాణి కపూర్ (Pragya Jaiswal, Taapsee, Vaani Kapoor)
ప్రగ్య జైస్వాల్ పుట్టింది, పెరిగింది ఉత్తర భారతంలో. కానీ ఆమెకి గుర్తింపు, విజయం దక్కింది మాత్రం తెలుగులోనే. బాలయ్య సరసన “అఖండ”లో నటించిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ లో ఒక మూవీ చేసింది. పెద్ద హీరో అక్షయ్ కుమార్ నటించిన “ఖేల్ ఖేల్ మే” సినిమాలో ప్రగ్య జైస్వాల్, తాప్సి, వాణి కపూర్ హీరోయిన్లుగా నటించారు. ప్రగ్యకి ఇది చాలా పెద్ద మూవీ. ఆమెకి విజయం వరిస్తుందా అనేది చూడాలి. తాప్సికి పెద్దగా ఈ సినిమా విజయంతో గానీ, అపజయంతో గాని ఫరక్ పడదు. కానీ కెరీర్ లో ఎదుగుదల లేని వాణి కపూర్ కి, ప్రగ్యాకి ఇది పరీక్ష.