
మెగా కాంపౌండ్ ను రాజకీయాల్ని వేరు చేసి చూడలేం. ఆ కుటుంబానికి చెందిన పవన్ కల్యాణ్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప-ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. జనసేన పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నారు. మరి ఇతర మెగా సభ్యుల సంగతేంటి?
గమ్మత్తుగా గంటల వ్యవథిలో ముగ్గురు వ్యక్తుల నుంచి 3 ప్రకటనలు రావడం విశేషం. మరీ ముఖ్యంగా వీళ్లంతా రాజకీయాలపై విముఖత వ్యక్తం చేయడం మరీ విశేషం.
ముందుగా చిరంజీవి విషయానికొద్దాం.. ఈమధ్య ఈయన రాజకీయ పునరాగమనంపై మరోసారి చర్చ మొదలైంది. ప్రధాని మోదీకి సన్నిహితంగా మెలగడం, పలు సందర్భాల్లో ‘జై జనసేన’ అంటూ నినదించడంలో చిరు రాజకీయం మళ్లీ మొదలయ్యేలా ఉందనే ప్రచారం జరుగుతోంది.
తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. తనకు రాజకీయాల్లోకి మరోసారి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ, సినిమాలకు దగ్గరగా ఉంటానని స్పష్టంగా చెప్పేశారు. మరో రకంగా సేవలు అందించడం కోసం రాజకీయ నాయకులకు దగ్గరగా ఉన్నాను తప్ప, రీఎంట్రీపై ఎలాంటి ఆసక్తి లేదని ప్రకటించారు.
దాదాపు ఇదే రకమైన ప్రకటన కొన్ని గంటల కిందట అల్లు అరవింద్ నుంచి కూడా వచ్చింది. రాజకీయాలనేవి సెపరేట్ స్కూల్ అన్నారు అరవింద్. గతంలో పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడానికి ప్రయత్నించానని, ఇప్పుడైతే తనక్ససలు పాలిటిక్స్ వద్దని తెగేసి చెప్పేశారు అరవింద్.
హీరో సాయిదుర్గతేజ్ కూడా ఇదే ప్రకటన చేశాడు. రాజకీయాలపై మాట్లాడేంత, రాజకీయాలు చేసేంత అనుభవం, వయసు తనకు లేవన్నాడు. భవిష్యత్తులో కూడా తను రాజకీయాల గురించి మాట్లాడనని, తనకు రాజకీయాలకు చాలా దూరమని స్పష్టం చేశాడు.
ఇలా ఒక రోజు గ్యాప్ లో చిరంజీవి, సాయిదుర్గతేజ్, అల్లు అరవింద్ రాజకీయాలపై స్పందించడం ఆసక్తి రేకెత్తించింది.