
అడివి శేష్, సిద్దూ జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి… ఈ ముగ్గురికి ఈ ఏడాది (2025) విషమ పరీక్ష ఎదురుకానుంది. తప్పనిసరిగా హిట్ కొట్టి చూపించాల్సిన పరిస్థితి.
ఈ యువ హీరోల బ్యాచ్ లో ఒకరైన విశ్వక్ సేన్ ఇటీవల ఘోరమైన అపజయాలు చూశాడు. “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”, “మెకానిక్ రాఖీ”, “లైలా” వరుసగా ఫ్లాపులు వచ్చాయి. “లైలా” చిత్రంలో అసభ్యత కారణంగా ప్రేక్షకులకు సారీ కూడా చెప్పాల్సి వచ్చింది. దాంతో, ఇప్పుడు అడివి శేష్, సిద్ధూ, నవీన్ పోలిశెట్టిల పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మొదలైంది.
ఈ ముగ్గురు హీరోలకు ఒక పోలిక ఉంది. వీళ్ళ సినిమాలకు డైరెక్టర్ డమ్మీ. యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్… ఇలా అంతా వీళ్లే చేస్తుంటారు.
అడివి శేష్
అడివి శేష్ చాలా టాలెంటెడ్. తన ప్రతి సినిమా వైవిధ్యంగా ఉండాలని ప్రయత్నిస్తుంటాడు. ఐతే, ఈ క్రమంలో ఆయనకి గ్యాప్ పెరిగిపోయింది. అడివి శేష్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అయింది. ఈ ఏడాది మూడు సినిమాలు విడుదల చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. నాని హీరోగా నటిస్తున్న “హిట్ 3” సినిమాలో ఒక పాత్ర పోషిస్తున్నాడు. అది ముందు విడుదల అవుతుంది. ఆ తర్వాత “డెకాయిట్”, “జీ2” అనే సినిమాలు వస్తాయి. ఈ చివరి రెండు సినిమాల్లో అతనే హీరో కాబట్టి వాటి విజయం ముఖ్యం. ఈ సినిమాలతో అతనికి పరీక్ష. రెండేళ్ల గ్యాప్ తర్వాత భారీ హిట్ కొట్టగలడా.
సిద్ధూ జొన్నలగడ్డ
సిద్ధూ జొన్నలగడ్డకి యూత్ లో తెగ క్రేజ్ వచ్చింది. “డీజే టిల్లు”గా హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత సీక్వెల్ “టిల్లు స్క్వేర్”తో మరింత భారీ విజయం దక్కించుకున్నాడు. దాంతో అతని రేంజ్ పెరిగింది. ఆ క్రమంలో ఒప్పుకున్న రెండు సినిమాలపై మరింత కేర్ తీసుకోవడం మొదలుపెట్టాడు. దాని కారణంగా ఎప్పుడో విడుదల కావాల్సిన “జాక్ కొంచెం క్రాక్” ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. బొమ్మరిల్లు భాస్కర్ తీస్తున్న ఈ సినిమాతో సిద్దూ హిట్ కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి.
ఈ సినిమాతో పాటు “తెలుసు కదా” అనే మరో సినిమా కూడా షూటింగ్ లో ఉంది.
నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టిది మరింత విచిత్ర పరిస్థితి. “జాతి రత్నాలు” సినిమాతో క్రేజ్ తెచ్చుకున్న ఈ హీరో అతి జాగ్రత్త వల్ల ఒక సినిమా మూడేళ్ళుగా షూటింగ్ జరుపుకుంటోంది. “అనగనగా ఒక రాజు” అనే సినిమాని మూడేళ్ళ క్రితం ప్రకటించారు. ఈ గ్యాప్ లో డైరెక్టర్ మారారు. హీరోయిన్ శ్రీలీల స్థానంలో మీనాక్షి చౌదరి వచ్చింది. మధ్యలో నవీన్ కి యాక్సిడెంట్ అయి ఇంట్లో రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది.
మొత్తానికి ఈ ఏడాది ఆ సినిమా విడుదలకు సిద్ధం అవుతోంది. మరి ఇన్నేళ్ళుగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాతో విజయం అందుకోవడం అంటే పెద్ద పరీక్ష. ఈ టెస్ట్ పాస్ కాగలడా?