
ప్రచారం కోసం నానా వేషాలు వెయ్యడంలో తెలుగు సినిమా నిర్మాతలు, పీఆర్వోలు, హీరోలు ముందుంటారు. ఏది వైరల్ ఐతే ఆ ట్రెండ్ ని పట్టుకొని హడావిడి చేస్తూ ఉంటారు. గత రెండు, మూడు రోజులుగా ట్విట్టర్ లో ‘గోర్క్’ (GORK) అనే AI టూల్ హడావిడి నడుస్తోంది.
చాట్ జిపిటికి పోటీగా ఎలాన్ మస్క్ కి చెందిన ట్విట్టర్ వేదికపై గోర్క్ అనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ని ప్రవేశపెట్టారు. ఈ టూల్ మనం ఏది అడిగినా సమాచారం ఇస్తుంది. ముఖ్యంగా గత రెండు రోజులుగా బీజేపీ వంటి పార్టీల అబద్దాలను, వాట్సాప్ వ్యాసాలలోని డొల్లతనాన్ని బయటపెట్టింది అని కాంగ్రెస్ నేతలు తెగ ప్రచారం చేశారు. అలాగే కొందరు జర్నలిస్టులు కూడా తెగ పోస్టులు పెట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల వరకు వస్తే… పవన్ కళ్యాణ్ రకరకాల సందర్భాలలో రకరకాలుగా మాట్లాడింది, చేగువేరా నుంచి సనాతనిగా మారిన అనేక విషయాలను తెలిపింది అని లోకల్ జనాలు అంటున్నారు.
దాంతో, రెండు, మూడు రోజులుగా ‘గోర్క్’ (GORK) క్రేజ్ పడింది. ఈ క్రేజ్ ని పట్టుకోవడంలో మన సినిమా వాళ్ళు ముందుంటారు కదా. సో, వెంటనే నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల తమ సినిమా ట్రైలర్ విడుదలకు సరైన ముహూర్తం ఏది అని గోర్కుని అడిగి డేట్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు. ఇక సిద్ధాంతి పెట్టే ముహుర్తాలకి కాలం చెల్లింది. ఏఐ టూల్స్ తోనే ముహుర్తాలు పెట్టుకోవచ్చు.
అలా “రాబిన్ హుడ్” సినిమా ‘గోర్క్’ (GORK)ని తమ ట్రైలర్ ఈవెంట్ కి ముహూర్తం ఫిక్స్ చేసింది.
నితిన్ కన్నా మేము ఏమి తక్కువ తిన్నామని “మేడ్ స్క్వేర్” సినిమా టీం కూడా ‘గోర్క్’ని తన ప్రచారంలో వాడుకుంటోంది. ఈ సినిమా కూడా “రాబిన్ హుడ్”లానే మార్చి 28న విడుదల కానుంది.
ఇక మునుముందు ఎన్ని సినిమాలు గోర్కుని తమ ప్రచారానికి వాడుకుంటాయో చూడాలి.